కర్నూలు (టౌన్): వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలను కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ మతాల పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ ఎవరి మనోభావాలకు భంగం కలుగకుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాద్యమాల్లో వచ్చే నిర్ధారణ లేని సందేశాలు, రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలను గుడ్డిగా నమ్మవద్దన్నారు. అలాగే బాధ్యతారహితంగా ఇతరులకు షేర్ చేయవద్దన్నారు. అనుమానాస్పద సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియజేయాలన్నారు. చట్ట ప్రకారం డీజేల శబ్ధం 70 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని సీజ్ చేస్తామన్నారు. వినాయక ఘాట్‌లో తగినంత నీటి లభ్యత లేని పక్షంలో నగర శివారులోని నన్నూరు టోల్‌ప్లాజా, ఉలిందకొండ ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లకు తగిన చర్యలు ఉంటాయన్నారు. కర్నూలు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 9వ రోజు నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా కొనసాగుతాయని సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మత పెద్దలు హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, మత పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


