బొమ్మలసత్రం: పట్టణంలోని ఎంఎస్ నగర్‌కు చెందిన లక్ష్మిదేవి అనే మహిళ అదృశ్యమైనట్లు త్రీటౌన్ పోలీసులు బుధవారం తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయల్దేరిన లక్ష్మిదేవి రైల్వే స్టేషన్ వరకు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా వెలుగులోకి రాగా తర్వాత ఆమె కనిపించకుండా పోయిందన్నారు. లక్ష్మిదేవి కూతురు పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ 81062 20337, 90525 06394 నంబర్లను సంప్రదించాలని కోరారు.
సుంకులమ్మ ఆలయంలో చోరీ
బేతంచెర్ల: మండల పరిధిలోని ఎం.పేండేకల్లు గ్రామంలో ఆదివారం రాత్రి సుంకులమ్మ ఆలయంలో హుండీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఆలయ పూజారి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. చోరీ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి ఆలయానికి భద్రతా చర్యలు చేపట్టి, చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే గాకుండా ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కూలీ పనికి వెళ్లి పాముకాటుతో మృతి
పాణ్యం: మండల పరిధిలోని తమ్మరాజుపల్లె గ్రామంలో పాముకాటుకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందారు. బుధవారం ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మండలి రమాదేవి (32) రోజులాగే ఉదయం 6 గంటలకు బెండకాయలు తెంపేందుకు వెళ్లారు. 7 గంటల సమయంలో ఆమె ఎడమ కాలికి విష పురుగు కాటువేసింది. తోటి కూలీలు, కుటుంబసభ్యులు హటాహుటిన చికిత్స నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. పరిక్షించిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు రోజు కూలి పని చేసుకుంటూ కుటుంబానికి తనవంతు అండగా ఉన్నారు. మృతురాలికి భర్త మహేంద్ర, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దివ్యాంగ మైనర్‌పై అత్యాచారయత్నం
● కామాంధుడిని పట్టుకుని
దేహశుద్ధి చేసిన స్థానికులు
ఆళ్లగడ్డ: కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక యువకుడు అభంశుభం తెలియని మానసిక దివ్యాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని అమాయక బాలిక అతడి వికృత చేష్టలకు భయపడి కేకలు వేయడంతో గమనించిన కాలనీవాసులు కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణ శివారులోని ఎంవీ నగర్ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలిక పుట్టుకతోనే మానసిక ఎదుగుదల లోపించింది. ఆ కాలనీ పరిధిలోని వీధుల్లో తిరుగుతుంటుంది. ఈ బాలికపై కన్నేసిన శివభార్గవ అనే యువకుడు బాలిక దొమ్మరికాలనీ సమీపంలోని రోడ్డు వెంట ఒంటరిగా వెళ్తుండగా మాయమాటలు చెప్పి పక్కనున్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. దస్తులు తొలగించి వికృత చేష్టలకు పాల్పడటంతో అభంశుభం తెలియని బాలిక భయంతో ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. గమనించిన అటుగా వెళ్తున్న వారు అక్కడకు వెళ్లి బాలికను రక్షించి అకృత్యానికి పాల్పడుతున్న శివభార్గవను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
పత్తి పైరు దున్నివేత
బనగానపల్లె: అసలే ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, ఇక యర్రనళ్లి ప్రభావంతో పత్తి పైరు దెబ్బతిందని, ఎన్ని క్రిమి సంహారక మందులు వాడినా ఫలితం లేకపోవడంతో రైతులు రోటావేటర్‌తో పైరును తొలగిస్తున్నారు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం మండలంలో రైతులు వ్యవసాయ బోర్లు, వర్షాధారం కింద సుమారు 1500 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పైరులో ఎదుగుదల లోపించింది. కాస్తోకూస్తో ఉన్న పైరును యర్రనళ్లి విపరీతంగా ఆశించినట్లు రైతులు వాపోతున్నారు. యర్రనళ్లి నివారణకు ఖరీదైన క్రిమి సంహారక మందులు వాడినా ఏమాత్రం అదుపుకాక పూత, పిందెలు నేల రాలుతుంటంతో దిగుబడిపై ఆశలు వదులుకుని పైరును తొలగిస్తున్నారు. దుక్కిసేద్యాలు, విత్తనాలు, వ్యవసాయ కూలీలు, రసాయన క్రిమి సంహారక మందులకు ఎకరానికి రూ.20–30వేలు పెట్టుబడి పెట్టినట్లు రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు పంట పూర్తిగా దెబ్బతినడంతో తమ పరిస్థితి ఎమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.


