ఉమ్మడి కర్నూలు జిల్లాను కరువు అతలాకుతలం చేస్తోంది. ఎక్కడ చూసినా నోళ్లు తెరిచిన బీళ్లే. ఇక లాభం లేదని ఎండిపోయిన పొలాలను దున్నేస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పించక మానవు. అప్పులు చేసి.. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటలు మట్టిలోనే కలిసిపోతుంటే రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఇంతటితో అయిపోలేదని, ముందుంది తీవ్రమైన కరువని శాస్త్రవేత్తలు హెచ్చరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జలాశయాల్లో నీరులేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బావుల్లోకి తొంగి చూస్తే కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వీటి కింద సాగుచేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


