నంద్యాల(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ సూక్ష్మ పూల బొమ్మలతో రాజన్న చిత్రం గీసి పుష్పాంజ లి అర్పించారు. వైఎస్సార్ తనదైన శైలిలో చిరునవ్వులు చిందిస్తున్నట్లు చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కోటేశ్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతు బాంధవుడిగా పేరు పొందారన్నారు. ఆయ న మరణం కోట్లాది ప్రజలను వేదనకు గురి చేసిందన్నారు. రాజన్న నవ్వు వికసించిన పువ్వుల వలే స్వచ్ఛంగా ఉంటుందని కొనియాడారు.
వైద్యులా.. భూత వైద్యులా?
ఆదోని: తనపై మహిళా డాక్టర్ క్షుద్రపూజలు చేయించిందంటూ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చ కు దారితీసింది. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఆది నాగేష్, అనస్థటిస్ట్‌గా డాక్టర్ లక్ష్మీ మోనాలిసా పనిచేస్తున్నారు. ఆది నాగేష్ ఆదోనిలో క్లినిక్ కూడా నడుపుతున్నారు. 3 రోజుల క్రితం క్లినిక్ నుంచి ఆయనకు అర్జంటుగా రావాలని ఫోన్ వచ్చింది. ఆయన హుటాహుటిన వెళ్లి సిబ్బందిని విచారించారు.
క్లినిక్ ఎదుట నల్లటి కవర్
క్లినిక్ ప్రధాన ద్వారం ఎదుట ఒక నల్ల బ్యాగు ఉండటాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఒక నర్సు భర్త ధైర్యం చేసి ఆ బ్యాగ్‌ను తెరిచి చూసి బిత్తరపోయారు. అందులో అనుమానాస్పద వస్తువులతో పాటు క్షుద్రపూజలు చేసిన సామగ్రి ఉంది. ఒక రాగి రేకు మీద డాక్టర్ ఆది నాగేష్ పేరు రాయబడి ఉంది.
సీసీ కెమెరా ఫుటేజీతో కలకలం
విషయం తెలుసుకున్న డాక్టర్ ఆది నాగేష్ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఓ మహిళ నల్లటి కవర్‌ను తీసుకొచ్చి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉంచి వెళ్లినట్లు ఫుటేజీలో కనిపించింది. ఆ మహిళ తన సహద్యోగి డాక్టర్ లక్ష్మీ మోనాలిసాగా గుర్తించి బిత్తరపోయారు. ఆస్పత్రి సిబ్బంది కూడా షాక్‌కు గురయ్యారు.
పోలీసుస్టేషన్‌కు చేరిన వివాదం
తాను చేసిన తప్పును ఎంతకూ ఒప్పుకోకపోవడంతో డాక్టర్ లక్ష్మీ మోనాలిసాపై డాక్టర్ ఆది నాగేష్ ఆదోని టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాల్సిందేనని, అవసరమైతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తానని డాక్టర్ ఆది నాగేష్ అంటున్నారు. మరో వైపు తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళనని, తాను కూడా డాక్టర్ ఆది నాగేష్‌పై అట్రాసిటీ కేసు పెడతానని తన సన్నిహితుల వద్ద డాక్టర్ లక్ష్మీ మోనాలిసా చెబుతున్నట్లు సమాచారం.
దేవతతో రాజకీయం
దేవనకొండ: సోదరుల్లా కలిసిమెలిసి ఉండే రెండు గ్రామాల మధ్య టీడీపీ నాయకులు రేపిన చిచ్చు వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలికింది. ఏకంగా మారెమ్మ దేవతను రాజకీయాలకు వాడుకోవడం ఆ పార్టీ నాయకులకే చెల్లింది.
గద్దెరాళ్ల మారెమ్మ పుట్టినిల్లు అయిన పల్లెదొడ్డి నుంచి ప్రతి శ్రావణమాస మూడో మంగళవారం భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి చల్ల సమర్పిస్తే రెండు గ్రామాలు సుఖసంతోషాలతో వర్ధిళ్లుతాయని ప్రజల నమ్మకం. అయితే గతంలో ఎప్పుడూ లేనివిధంగా జూన్ 5న కూటమి ప్రభుత్వ నాయకులు కొత్తగా ఆలయ కమిటీని ఏర్పరుచుకున్నారు.కమిటీలో చైర్మన్ పదవి మొదలుకుని మెంబర్ల దాకా పల్లెదొడ్డి గ్రామస్తులను ఎవరినీ సంప్రదించకుండా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ కనుసన్నల్లో నచ్చిన వారికి పదవులు ఇచ్చుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్లు అయ్యింది. గద్దెరాళ్ల మారెమ్మ అంటేనే మొదటగా గుర్తుకొచ్చేది. అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నది పల్లెదొడ్డి బోనాలు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గ్రామాన్ని వదిలి ఆలయంతో సంబంధం లేని గ్రామాల్లోని వారికి పదవులు ఇవ్వడంతో పల్లెదొడ్డివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మారెమ్మవ్వ ఆలయ కమిటీలో పల్‌దొడ్డి గ్రామవాసులకు ప్రాధాన్యత కల్పించలేదని, అలాంటి చోట తమ ఊరి బోనాలు కూడా అవసరం లేదని, తమ గ్రామంలోనే బోనాల సంబరం జరుపుకుంటామని గ్రామ పెద్దలందరూ తీర్మానించుకున్నారు. వందల ఏళ్ల సాంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నా దేవదాయ శాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ శ్రావణమాసం మూడో మంగళవారం అమ్మ వారికి చల్లదనం పల్లెదొడ్డి, గద్దెరాళ్ల ప్రజలు ఎవరి ఊళ్లలో వారు జరుపుకున్నారు. అసలే ఒక పక్క వర్షాలు లేక కరువు తాండవిస్తోందని, మరో పక్క గ్రామాల ప్రజలు ఎవరికి వారుగా ఉంటే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే అమ్మవారి దేవరలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


