డోన్ రూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లకు సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ జింకా శ్రీకాంత్, ఐటీఐ ప్రిన్సిపాల్ నాగకేశాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డేటా అనోటేటర్ అసిస్టెంట్ (3) ఓసీ, డేటా క్యూరెటర్ అసిస్టెంట్ (3) ఓసీ–1, బీసీ–1, ఎస్సీ–1, పోస్టులు డోన్ ఐటీఐలో అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఎంపికకు సంబంధించి 22 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల్లోపు వివరాలను సమర్పించాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు దగ్గర్లోని ఐటీఐ ప్రధానాధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. నియామక ప్రకియ డిప్యూటీ డైరెక్టర్ రీజినల్ ఆఫీస్, ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్, పద్మావతిపురం, తిరుచానూర్ రోడ్డు, తిరుపతి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
డోన్ టౌన్: మండలంలోని చింతలపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కుమ్మరి వెంకటస్వామి (27) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆగస్టు 28న తండ్రి మందలించడంతో వెంకటస్వామి ఇంటి నుండి వెళ్లిపోయి గ్రామ సమీపంలో గోసానిపల్లె నుంచి ధర్మారం గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు గుండా పొలాల్లోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వెంకటస్వామికి నాలుగు సంవత్సరాల క్రితం హరిప్రియ అనే యువతితో వివాహం జరిగింది. ఉడుములపాడు సమీపంలోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించేవారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన అతని కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో గురువారం అటు వైపు పొలం పనులకు వెళ్లిన వారికి దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి లక్ష్మిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
ఆటో ఢీకొని వ్యక్తి మృతి
కర్నూలు (సిటీ): కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఇ.తాండ్రపాడు గ్రామంలో ఆటో ఢీకొనడంతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. అదే గ్రామంలోని టీజీ నగర్‌కు చెందిన ఎం.రాజేంద్ర బాబు (56) బార్బర్ షాప్ నిర్వహిస్తున్నాడు. రాత్రి షాప్‌కు మూత వేసి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలోని వంతెన వద్ద ఇ.తాండ్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో రాజేంద్రబాబుకు తీవ్ర గాయాలైనప్పటికీ ఆటోడ్రైవర్ అలాగే ముందుకెళ్లిపోయాడు. అదే దారిలో వెళ్తున్న కొందరు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి కోలుకోలేక మృతిచెందాడు. మృతుడికి భార్య ఎన్.శంకరమ్మ, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఏఎస్‌ఐ కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
బొమ్మలసత్రం: కారు ప్రమాదంలో మృతిచెందిన ఆళ్లగడ్డ ఏఎస్‌ఐ సురేష్‌రెడ్డి కుటుంబానికి రూ. 20.80 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ గురువారం అందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏఎస్‌ఐ సురేష్‌రెడ్డి ఈఏడాది 7వ నెలలో కారు ప్రమాదంలో మృతిచెందాడన్నారు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. మృతిచెందిన పోలీస్ కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్‌బాషా, కార్యాలయ అధికారులు వీరన్న, కవిత, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామినాయక్ ఉన్నారు.
హైకోర్టు బెంచ్ సాధించే వరకు ఉద్యమం
కర్నూలు: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ సాధించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని న్యా యవాదులు స్పష్టం చేశారు. వారి రిలే నిరాహార దీక్షలు 11వ రోజు గురువారం కొనసాగాయి. న్యాయవాదులు నిస్సీ, గౌతమ్ శేఖర్, తులసి ఈ శ్వర్ రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న న్యాయవాదుల విధుల బహిష్కరణ ఈనెల 11వ తేదీ వరకు కొనసాగించాలని తీర్మానించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు.


