కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అనుచరుడు బుధవారం రాత్రి వర్సిటీలో వీరంగం సృష్టించాడు. వీసీని కలవడానికి అనుమతివ్వలేదనే కారణంతో వీసీ పీఏతో మొదలైన దూషణల పర్వం, వీసీ డ్రైవర్, ఒక సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులను అసభ్య పదజాలంతో విరుచుపడ్డాడు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.విజయ్‌కుమార్ నాయుడు ఎదుటే దూషణల పర్వం కొనసాగింది. రిజిస్ట్రార్‌ను ఉద్దేశించి ‘‘కడపలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు అది పోయింది, నీ విషయంలో జోక్యం చేసుకోలేదు. వీసీకి, రిజిస్ట్రార్‌కు నేను ఎంత సపోర్ట్ చేశానో తెలుసా’’ అంటూ విరుచుకుపడ్డాడు. ‘‘మా ఆడబిడ్డపై దాడి చేస్తారా.. మా గవర్నమెంట్ ఇది, ఎవరు నన్ను ఆపేది, అయితే సస్పెండ్ చేస్తారు అంతే కదా. ఇక్కడ అందరి జాతకాలు తెలుసు. ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేలు, రూ.లక్ష తీసుకొని డ్రామాలు చేస్తారా’’ అంటూ వీరంగం సృష్టించాడు. బైరెడ్డి శబరి అక్కకు ఒక్క ఫోన్ చేస్తే.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ ఇలాగే చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుందని చెప్పడంతో ఆయనతో పాటు మాట్లాడటానికి రిజిస్ట్రార్ ఛాంబర్‌కు వెళ్లాడు. విద్యార్థులు గొడవ పడితేనే సస్పెండ్, వర్సిటీని బహిష్కరించే వర్సిటీ అధికారులు, మరి వర్సిటీ పరిపాలనాధికారి ఎదుటే, పరిపాలనా భవనంలోనే ఇష్టానుసారం అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డ విద్యార్థి సంఘం నాయకునిపై ఏమి చర్యలు తీసుకుంటారోననే చర్చ వర్సిటీలో సాగుతోంది.


