శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో గురువారం సాయంత్రానికి 144.8036 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటి మట్టం 870.70 అడుగులకు చేరుకుంది. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో కంటే దిగువ ప్రాజెక్ట్‌లకు విడుదల చేస్తున్న ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉండడం వలన జలాశయ నీటిమట్టం రోజురోజుకు పడిపోతుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి కేవలం 8,328 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంకు విడుదలవుతుంది. బుధవారం నుంచి గురువారం వరకు జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 27,434 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం (సున్నిపెంట) ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.రవీంద్రబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు www. itiadmissions.ap.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదవ తరగతిలో మెరిట్ ప్రకారం 7వ తేదీ మధ్యాహ్నం 2.30లకు శ్రీశైలం ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు 9493252324, 9441181072ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఫలించిన శిల్పా పోరాటం
● కేసీ, కుందూకు నీటి విడుదల
బండి ఆత్మకూరు: సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి చేపట్టిన సమర శంఖారావం కార్యక్రమం ఫలితాన్నిచ్చింది. వెలుగోడు రిజర్వాయర్‌లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కాలువలకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదు. దీంతో రైతులు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల ఒకటవ తేదీన శిల్పా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు పిలుపునకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంటనే వీబీఆర్ నుంచి కాల్వలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అధికారులు హామీ ఇచ్చిన మేరకు గురువారం కుందూ, కేసీ కెనాల్‌కు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. దీంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


