ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు.. రైతుల పొలాలకు కన్నీళ్లా? | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు.. రైతుల పొలాలకు కన్నీళ్లా?

Sep 8 2026 1:53 AM | Updated on Sep 8 2026 1:53 AM

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

బుడ్డా శేషారెడ్డి ధ్వజం

వెలుగోడు: ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పొలానికి మాత్రం సాగునీరు ఎలా అందుతోందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ప్రశ్నించారు. రైతుల కష్టాలను వివరిస్తూ, ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ సోమవారం బుడ్డా శేషారెడ్డి ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం అల్లాడుతున్నారు. తాగునీటికి మాత్రమే నీళ్లు విడుదల చేస్తున్నామని అధికార పార్టీ నాయకులు, అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు చెరువులు, కుంటలు నింపి పశువులకు నీరు అందించడంతో పాటు భూగర్భ జలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ కృష్ణా జలాలను, కాలువల ద్వారా వస్తున్న నీటిని చెరువులకు మళ్లించకుండా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పొలానికి మాత్రం నేరుగా నీరు ఎలా పారుతోంది?’’ అని బుడ్డా శేషారెడ్డి ప్రశ్నించారు.

మిగతా రైతుల పరిస్థితి ఏంటి?

‘‘కాలువల వెంట ఇరిగేషన్‌ అధికారులు, లస్కర్లను, సిబ్బందిని కాపలాగా పెట్టి తూముల వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆ నిఘా అంతా ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు సక్రమంగా చేరేందుకేనా? మేడం కలెక్టర్‌ గారు, ఎస్పీ గారు క్షేత్రస్థాయిలోకి వచ్చి రైతుల పొలాలను పరిశీలించండి. పక్కనే ఉన్న పొలాలు నెర్రెలు వారి ఎండిపోతుంటే ఎమ్మెల్యే పొలంలో మాత్రం మనుషులను పెట్టి నీళ్లు పారిస్తున్నారు. మొన్ననే ఒక రైతు కొత్తగా బోరు వేసినా భూగర్భ జలాలు అందక కొద్దిసేపు నీరు వచ్చి మళ్లీ ఆగిపోతున్నాయి. నారుమడులు పూర్తిగా ఎండిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. సొంత పొలాలకు మాత్రమే నీరు మళ్లించుకుంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి

‘‘తెలుగుగంగ, కేసీ కెనాల్‌, ఇతర కాలువలకు నీళ్లు బ్రహ్మాండంగా పారినప్పుడు తాను రైతునని చెప్పుకోవడం సులభమే. పక్క రైతులు ప్రశ్నిస్తే అహంకారంతో సమాధానం చెప్పకుండా, ప్రజల కడుపుకొట్టే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అన్నట్టుగా వ్యవహరించకండి. రైతులందరికీ సమానంగా సాగునీరు అందించండి.’’ అని బుడ్డా శేషారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement