బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 110 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్‌షొరాణ్ మాట్లాడుతూ.. కొన్ని ఫిర్యాదులను ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కరించామన్నారు. మరికొన్నింటిని ఆయా స్టేషన్ అధికారులకు బదిలీ చేశామన్నారు. ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు.
పింఛన్లకు
కొత్త దరఖాస్తుల స్వీకరణ
నంద్యాల(న్యూటౌన్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అర్హులైన కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంపై జిల్లా, మండల స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సెప్టెంబరు 7 నుంచి 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కొత్త పింఛన్ దరఖాస్తులను స్వీకరించి, ఆన్‌లైన్ లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్‌ఓ రామునాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పర్యాటక విశిష్టత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక విశిష్టత అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం శాఖ అధికారి సునీల్‌కన్నా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 18లోగా ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ 5వ అంతస్తు, స్టాలిస్ కార్పొరేట్ ఆటోనగర్ విజయవాడకు పంపాలన్నారు. దరఖాస్తులను నిర్దేశిత నమూనాలో పోస్టు ద్వారా, స్వయంగా ఆర్డ్ కాపీ సమర్పించాలన్నారు. ప్రతి దరఖాస్తుతో 100 పదాలకు మించని సంక్షిప్త వివరణ ఉండాలన్నారు. వివరాలకు సెల్ : 9440841126, 8297098022కు సంప్రదించాలన్నారు.
డ్రంకెన్ డ్రైవ్‌తో బస్సు డ్రైవర్‌కు జైలు
చాగలమర్రి: మద్యం సేవించి బస్సు నడుపుతున్న వ్యక్తికి ఆళ్లగడ్డ స్పెషల్ కోర్టు మెజిస్ట్రేట్ రవికుమార్ ఐదు రోజులు సాధారణ జైలు శిక్ష విధించినట్లు చాగలమర్రి ఎస్‌ఐ ఎం. రాజారెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబరు 7వ తేదీ తెల్లవారుజామున చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా డ్రైవర్ విట్టల్ అతిగా మద్యం సేవించి హైదరాబాద్ నుంచి బస్సు నడుపుతూ వస్తున్నాడు. వాహనాన్ని ఆపి బ్లీతింగ్ అనలైజర్‌తో పరీక్షించగా 200ఎంజి పరిమితికి మించి మెతాదు నిర్ధారణ అయ్యింది. నిందితున్ని అరెస్టు చేసి ఆళ్లగడ్డ స్పెషల్ మెజిస్ట్రేట్ రవికుమార్ ఎదుట హాజరుపరచగా ఐదు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ ఎం రాజారెడ్డి తెలిపారు.
అమ్మానాన్న మృతితో అనాథలుగా...
ఆళ్లగడ్డ: తల్లిదండ్రులు మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ విషాద ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని పాలసాగరం సమీపంలో నివాసముండే కరీం బాషా (37), అతని భార్య నశీమున్‌లు ఇంట్లో వివిధ రకాల నూనెలను గానుగ ఆడించి జీవనం కొనసాగించే వారు. ఆరు నెలల కింత్రం నశీమున్ గానుగ మిషన్ ఆడిస్తూ ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలు తస్లీం, సోఫియాల బాధ్యతను తండ్రి కరీం బాషా తీసుకున్నాడు. అయితే ఆదివారం రాత్రి గుండోపోటు రావడంతో మృతి చెందాడు. సోమవారం ఉదయం తండ్రి ఎంతకూ లేకపోవడంతో చిన్నారులు వెళ్లి ఎంత పిలిచినా పలకలేదు. భయపడిన చిన్నారులు గట్టిగా ఏడుస్తూ కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. తల్లిదండ్రులు లేక ఆ చిన్నారులు అనాథలుగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వంస్పందించి ఆ చిన్నారుల చదువుల బాధ్యతను స్వీకరించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కరీం బాషా కుమార్తెలు


