భక్తుల మొర ఆలకించేదెవరు? | - | Sakshi
Sakshi News home page

భక్తుల మొర ఆలకించేదెవరు?

Sep 3 2026 8:53 AM | Updated on Sep 3 2026 8:53 AM

● గతంలో ‘డయల్‌ యువర్‌ ఈఓ’ కార్యక్రమంతో అధికారుల దృష్టికి భక్తుల సమస్యలు ● ఉత్సవాలు, ముఖ్యమైన పర్వదినాల పేరుతో ఎగనామం ● నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు

● గతంలో ‘డయల్‌ యువర్‌ ఈఓ’ కార్యక్రమంతో అధికారుల దృష్టికి భక్తుల సమస్యలు ● ఉత్సవాలు, ముఖ్యమైన పర్వదినాల పేరుతో ఎగనామం ● నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు
ఉపయోగంలేని ఫిర్యాదుల బాక్స్‌లు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. కనీసం వారి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయడం లేదు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎదురైన కష్టాలను చెప్పుకునేందుకు దేవస్థానం అవకాశం ఇవ్వడం లేదు. శ్రీశైల క్షేత్రంలో కొలువైన భ్రమరాంబా సమేతా మల్లికార్జున స్వామి కటాక్షం పొందేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు దర్శన సౌకర్యాలు, పలు ఆర్జితసేవలు, లడ్డూప్రసాదాలు, అన్నప్రసాద వితరణ, వైద్యసౌకర్యాలు, వసతి, టికెట్ల కౌంటర్లు, డోనేషన్‌ కౌంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యానవనాల నిర్వహణ, పార్కింగ్‌ తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఎటువంటి సౌకర్యాలు మెరుగుపర్చాలి, ఆర్జితసేవల నిర్వహణ ఎలా ఉంది, స్వామిఅమ్మవార్ల అలంకార దర్శన సౌకర్యాలు, స్పర్శదర్శనం, దర్శన సమయ వేళలు, ఇంకా పలు విషయాలపై భక్తుల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, క్షేత్రాభివృద్ధికి భక్తుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకోవడం, భక్తుల అసౌకర్యాలపై ఫిర్యాదులు స్వీకరించడం వాటిని పరిష్కరించడం, తదుపరి పునరావృతం కాకుండా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ తరహాలో ఏర్పాటు చేశారు.

మోగని ‘డయల్‌ యువర్‌ ఈఓ’ ఫోన్‌

భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు, రాష్ట్ర దేవదాయశాఖకమిషనర్‌ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమాన్ని 2021 డిసెంబరు 22న అట్టహాసంగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 08524–287111నెంబరును కేటాయించారు. ప్రతి బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు భక్తులు ఫోన్‌ చేసి తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమం అనంతరం అన్ని విభాగాల అధికారులతో, సిబ్బందితో ఈఓ సమీక్షించి భక్తుల నుంచి వచ్చిన ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొన్ని వారాల పాటు సజావుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారానికి ఒకరోజు కాకుండా నెలలో ఒక రోజు మాత్రమే నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శ్రీశైల దేవస్థానంలో ముఖ్య పర్వదినాలు, ముఖ్యమైన రోజులు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాల నిర్వహణ సాకుతో కార్యక్రమానికి మొత్తానికి ఎగనామం పెట్టారు.

దేవస్థానం డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేశారు. దేవస్థాన పరిపాలన భవనం వద్ద, వసతి గదుల కేంద్రాల వద్ద, సీఆర్‌వో కార్యాలయం, క్యూలైన్ల వద్ద, అన్నప్రసాద వితరణ భవనం వద్ద తదితర ప్రదదేశాలలో ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేశారు. కానీ ఫిర్యాదుల బాక్స్‌లపై అవగాహన లేని భక్తులు వాటిని వినియోగించడం లేదు. అసలు ఫిర్యాదు బాక్స్‌లు ఉన్నాయో లేదో భక్తులకు అవగాహన లేదు. ఇప్పటికై న దేవస్థాన అధికారులు స్పందించి గతంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమాన్ని పునఃప్రారంభించి ఆ కార్యక్రమం ద్వారా భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించి క్షేత్రాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement