సింహ వాహనంపై సిద్ధగురుడు | - | Sakshi
Sakshi News home page

సింహ వాహనంపై సిద్ధగురుడు

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

మంత్రాలయం: మంగళ వాయిద్యాల సుస్వర నాదాలు, కర్ణాటక డప్పు దరువులు, పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజనం కోలాహలం మధ్య శ్రీ ప్రహ్లాదరాయుడు సింహవాహనంపై కొలువుదీరాడు. జయజయ ధ్వానాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కడు వైభవంగా ఊరేగారు. శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధన సప్త రాత్రోత్సవాల్లో భాగంగా శనివారం పూర్వారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులకు ఊంజల మండపంలో ఊంజల, దివిటీ సేవలు జరిపారు. అనంతరం ప్రహ్లాదరాయలును సింహవాహనంపై శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు.

విశేషంగా పూర్వారాధన

శాస్త్రోక్తంగా సాగిన పూర్వారాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామిజీ ఆశీస్సులతో రాఘవేంద్రుల మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్పార్చన, విశేష పంచామృతాభిషేకంతో పాటు పుష్పాలంకరణ చేశారు. రాయరు, మూల, జయ, దిగ్విజయ రాముల సంస్థాన పూజలో స్వామిజీ తరించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

పూర్వారాధన సందర్భంగా యోగీంద్ర మంటపంలో చేపట్టిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన కడబ శ్రీనివాస్‌ సంగీత విభావరి, బెంగళూరు అనురాగ కళా గురుకుల బృందాం భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వేడుకలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌–1 శ్రీనివాసరావు, మేనేజర్‌–2 వెంకటేష్‌జోషి, మేనేజర్‌–3 శ్రీపతి ఆచార్‌, మేనేజర్‌–4 సురేష్‌ కోనాపూర్‌, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement