మహానంది: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలనను అంతమొందిద్దామని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్‌సీపీ శ్రేణులు పిలుపునిచ్చారు. బాబు రెండేళ్ల పాలన అంతా దగానే అని, ఏ ఒక్క ఎన్నికల హామీని సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు. మహానందిలోని శాలివాహన అన్నసత్రం ప్రాంగణంలో ఆదివారం మహానంది మండల రైతులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని, రైతుల కంట కన్నీరు వస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శ్రీశైలంలో 90 టీఎంసీలు ఉన్నా పంట పొలాలకు నీళ్లిచ్చామని, ప్రస్తుతం నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇవ్వకపోడం దారుణమన్నారు. వారం రోజుల్లో నీళ్లు విడుదల చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు కులమే మన కులమని, రైతుల కోసం ఎంతటి పోరాటానికై నా వెనుకాడనని అన్నారు. జగన్ మోహన్‌రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే చంద్రబాబునాయుడు తెలంగాణ వాళ్లకు సమాచారం ఇచ్చి వారి ద్వారా నేషనల్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ వాళ్లు అన్యాయంగా ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నందుకే చంద్రబాబు అక్కడి నుంచి వచ్చారన్నారు.
ఎమ్మెల్యే బుడ్డాకు రైతుల కష్టాలు పట్టవా?
రైతుల కష్టాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడకపోవడం బాధాకరమని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మీ గ్రామాలకు వస్తే సాగునీటి విడుదలపై నిలదీయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టుల తరహాలో పోరాడాలని, త్వరలో ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్ల ద్వారా రైతులు, ప్రజలు సంఘటితమై చలో వెలుగోడు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి..
అధికారం కోసం చంద్రబాబునాయుడు మాయమాటలతో పాటు అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని శిల్పా అన్నారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇలాంటి అనేక హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బాబుకు ఓటుతో సమాధానం చెబుతారన్నారు. సమావేశంలో మహానంది మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మా మహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా మధుసూదన్‌రెడ్డి, ప్రచార కార్యదర్శి ఏవీ కృష్ణారెడ్డి, రైతు విభాగం నాయకులు బాల వెంకటరెడ్డి, కందుల వెంకటసుబ్బారెడ్డి, సాగేశ్వరరెడ్డి, జయనారపురెడ్డి, రఘురామిరెడ్డి, గోపాల్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి శివయ్య పాల్గొన్నారు.
కూటమి పాలనలో ప్రజలకు
ఒరిగిందేమీ లేదు
మహానందిలో మనం చేసిన పనులకే
మళ్లీమళ్లీ ప్రారంభ పూజలు
వారం రోజుల్లో రైతులకు
నీళ్లు ఇవ్వకపోతే యుద్ధమే
ఎమ్మెల్యే బుడ్డా అసెంబ్లీలో
మాట్లాడకపోవడం బాధాకరం
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే
శిల్పా చక్రపాణిరెడ్డి


