నంద్యాల(న్యూటౌన్): 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోరందుకుంది. కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఉద్దేశించిన వెబ్ ఆప్షన్ల నమోదు ఈనెల 6 నుంచి మొదలైంది. ఈ నెల 27వ తేది రాత్రితో ఈ గడువు ముగియనుంది. మొదటి విడతలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే వివిధ కళాశాలలకు ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకునేందుకు చివరి అవకాశం ఈ నెల 28వ తేదీ వరకు ఉంది. నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (ఎస్‌ఈపీ) అమల్లో భాగంగా డిగ్రీ కోర్సులను సమూల మార్పులతో తీర్చిదిద్దిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆన్‌లైన్ అడ్మిషనన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) విధానంలోనే 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. వాటిని హెల్ప్ లైన్ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనే పరిశీలన చేస్తున్నారు. తదుపరి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
గత ప్రభుత్వ సంస్కరణల బాటలో..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం విద్యారంగంలో సమూలమైన మార్పులను తీసుకొచ్చింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు పారదర్శక విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ గత రెండేళ్లుగా ఇదే విధానంలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. జిల్లాలోని ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె, నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు 88 ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న విద్యార్థులకు సెప్టెంబర్ 2న కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరగనుంది. సెప్టెంబర్ 3న తరగతులు ప్రారంభమవుతాయి.
27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు
అవకాశం
మార్చుకునేందుకు 28 వరకు
తుది అవకాశం
సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు
వచ్చేనెల 3నుంచి
తరగతులు ప్రారంభం


