డోన్: రౌడీషీటర్లు, మట్కాబీటర్లను వెంట వేసుకొని టీడీపీ కార్యకర్తలు ఆదివారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతన ఎంపీడీఓ భవనం వద్ద బీభత్సం సృష్టించారు. పట్టణానికి తలమానికంగా రూ.2 కోట్లతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించిన కొద్ది గంటలలోపే టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. పాతపేటకు చెందిన 4వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ సుధీష్‌తో పాటు కటిక రమణ(మట్కాబీటర్), గొల్ల రవి అనే పాత నేరస్తునితో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలు పెద్ద బండరాళ్లతో గేటు తాళాన్ని బద్దలు కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకుండా సర్దిచెప్పి పంపించేశారు. కాగా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారని ఎంపీడీఓ వెంకటేశ్వరెడ్డి ఆదివారం రాత్రి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


