ఉమ్మడి జిల్లాలో 139 మంది రైతులకు నోటీసులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) బకాయిల వసూలుకు రైతుల మెడపై వేలం కత్తి పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే వందలాది మంది రైతుల స్థిరాస్తులను అమ్మకానికి పెట్టేందుకు డీసీసీబీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నా మీ కోసం కార్యక్రమం ద్వారా అధికారిక లెక్కల ప్రకారమే ఉమ్మడి జిల్లాలో 60వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్రబ్యాంకు బకాయిలు చెల్లించలేదనే కారణంతో తనఖా పెట్టిన ఆస్తులను అమ్మకానికి పెట్టడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలను ముమ్మరం చేసింది. మొత్తం 139 మంది రైతుల స్థిరాస్తులను వేలం వేసేందుకు షెడ్యూలు ఖరారు చేయడం, వేలం పాటలో పాల్గొనాలని గ్రామాల్లో దండోర వేయడం, వేలం పాట వేదికలను ప్రకటించడం పట్ల గ్రామాల్లో కలకలం రేగుతోంది. రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఈ సమయంలో ఆస్తుల వేలం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది
వేలం ద్వారా విక్రయానికి చర్యలు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది నుంచే డీసీసీబీ జప్తులు, ఆస్తుల స్వాధీనం, వేలం ద్వారా విక్రయానికి చర్యలను ముమ్మరం చేసింది. 2014–15 నుంచి 2018–19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో వరుస కరువులు వచ్చాయి. పంటలు పండక రైతులు అల్లాడుతుంటే అప్పట్లో కూడా జప్తుల పర్వాన్ని కొనసాగించారు. తాజాగా ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.10 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు 139 మంది రైతులకు చెందిన స్థిరాస్తులను వేలం ద్వారా విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 26 నుంచి వేలం ద్వారా ఆస్తులను విక్రయించేందుకు ఇప్పటికే ఆయా గ్రామాల్లో టాంటాం వేయించడం గమనార్హం. ప్రస్తుతం జిల్లా సహకార కేంద్రబ్యాంకు శాఖల నుంచి దీర్ఘకాలిక రుణాలతో పాటు వివిధ పథకాల కింద పంపిణీ చేసిన రుణాలను రాబట్టుకునేందుకు వేలం అస్త్రాన్ని డీసీసీబీ ప్రయోగించింది. వేలం పాట నిర్వహించేందుకు బ్రాంచీ వారీగా సేల్ ఆఫీసర్ కూడా నియమితులయ్యారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు కృష్ణానగర్ శాఖ పరిధిలోనే 18 మంది రైతులకు చెందిన 95 ఎకరాల రైతుల భూములను వేలం ద్వారా విక్రయించేందుకు షెడ్యూల్ ఖరారైంది. మరో 386 మంది రైతుల ఆస్తులకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌లు దాఖలయ్యాయి.
రూ.280 కోట్లకు చేరుతున్న
నిరర్థక ఆస్తులు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు నిరర్ధక ఆస్తులు కొండలా పెరగిపోతున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో రూ.183 కోట్ల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి నిరర్థక ఆస్తులు రూ.280 కోట్లకు చేరడం గమనార్హం. ఆలూరు, డోన్, ఆదోని, పత్తికొండ, కృష్ణానగర్, కోడుమూరు, కోవెలకుంట్ల, నందికొట్కూరు, వెలుగోడు, ఆత్మకూరు బ్రాంచీల్లో నిరర్థక ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
లాబాల బాట పట్టించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
నష్టాల ఊబిలో చిక్కుకొన్న డీసీసీబీకి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీ చేసే ఏర్పాటు చేసింది. ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్సార్‌సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచ్చింది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో గణనీయమైన నికర ఆదాయం పొందింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్‌లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చింది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీననమైన బ్యాంకుగా రికార్డు నమోదు చేసుకోవడం గమనార్హం.
వేలంలో ఆస్తుల విక్రయానికి
డీసీసీబీ చర్యలు
ఈ నెలలోనే వేలంపాట..
గ్రామాల్లో దండోరా


