అజీమ్‌ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

అజీమ్‌ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

Aug 18 2026 12:57 AM | Updated on Aug 18 2026 12:57 AM

నంద్యాల(న్యూటౌన్‌): ఉన్నత విద్య అభ్యశించే విద్యార్థినులు అజీమ్‌ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులకు సంవత్సరానికి రూ.30 వేలు మంజూరవుతుందన్నారు. ఈ స్కాలర్‌షి ప్‌ అర్హత పొందాలంటే విద్యార్థిని 10, 12వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ప్రైవేటు కళాశాలలో అయితే డిగ్రీ, డిప్లమా అభ్యసిస్తూ ఉండాలన్నారు. డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు తమ పరిధిలో ఉన్న డిగ్రీ, డిప్లమా, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో డిగ్రీకి సమానమైన ఇతర కోర్స్‌లను అందించే విద్యాసంస్థలకు ఈ స్కాలర్‌షిప్‌పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. స్కాలర్‌షిప్‌నకు పోర్టల్‌లోని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు.

డ్రంకన్‌ డ్రైవ్‌లో

ముగ్గురికి జైలు

డోన్‌ రూరల్‌: డోన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష పడింది. పట్టణంలోని కొండపేటకు చెందిన బోయ సునీల్‌, విజయ్‌ కుమార్‌కు 8 రోజులు, చాకలి గోపాల్‌కు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ సోమవారం డోన్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు టౌన్‌ సీఐ ఇంతియాజ్‌ బాషా తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

పీజీఆర్‌ఎస్‌కు 112 వినతులు

బొమ్మలసత్రం: జిల్లా పోలీస్‌ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారుల నుంచి 112 వినతులు అందాయి. జిల్లా ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు. చట్టపరిధిలో ఉన్న అన్ని సమస్యలను ఆయా స్టేషన్‌ అధికారులు పరిష్కరించాలని, సమస్యలు తిరిగి పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సివిల్‌ తగాదాలు ఏవైనా ఉంటే బాధితులకు నచ్చజెప్పి కోర్టును ఆశ్రయించేలా చూడాలన్నారు.

ఉత్తమ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు

నంద్యాల(న్యూటౌన్‌): స్కూల్‌ ఆఫ్‌ స్సోర్ట్స్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల కోసం జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 29న మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు ఉత్తమ పాఠశాలలకు స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌ అవార్డుకు ఎంపిక అవుతాయన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడా పోటీల్లో పాఠశాలలో సాధించిన ప్రదర్శన, అత్యున్నత విజయాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయాలన్నారు. ఈనెల 20వ తేదీన దరఖాస్తులకు చివరి తేదీ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement