నంద్యాల(న్యూటౌన్): ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ సోమ వారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందన్నారు. పెట్రోల్, డీజిల్ నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలన్నారు. నంద్యాల జిల్లాకు రూ.25 వేల కోట్లు ప్రత్యే క ప్యాకేజీ కేటాయించాలని, ఇందుకు జిల్లా నేతలు గళం విప్పాలని కోరారు. కరోనా సందర్భంగా రద్దయిన రైళ్లను వెంటనే పునఃప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జిల్లాలో సీడ్‌హబ్‌ను ఏర్పాటు చేయాలని, అలగనూరు రిజర్వాయర్‌ను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమ, పవర్‌గ్రిడ్, సోలార్ పరిశ్రమల్లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌బాబు, రఘురామ్మూర్తి, భార్గవ్, భాస్కర్, రాముడు, నాగరాముడు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మిదేవి, రజిత, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
మోదీ అసమర్థ పాలనతో
దేశంలో ఆర్థిక సంక్షోభం
సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఈశ్వరయ్య


