మహానంది: శ్రావణ మొదటి శుక్రవారం సందర్భంగా మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఆలయ అర్చకులు మణికంఠశర్మలు ఉదయం నుంచి అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. అమ్మవారికి 13 పట్టుచీరలతో, అమ్మవారి ఆలయ మండపంలో సుమారు వంద చీరలతో అలంకరించారు. శ్రావణమాసం శుక్రవారం పురస్కరించుకుని యాగశాలలో చండీహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు హైదరాబాద్ వాస్తవ్యులైన వారణాసి రామ్మోహన్‌రావు దంపతుల ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు.
కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆదేశాల మేరకు కేజీబీవీల్లో జిల్లా ప్రొఫెషనల్ మెరిట్ జాబితాలను, ఖాళీల వివరాలను samagrashikshanandyal. blogspot.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు వివరాలను పరిశీలించుకొని దరఖాస్తులు, ఫిర్యాదులు ఉన్నట్లు అయితే తగిన ఆధారాలతో ఈనెల 16లోగా ఆన్‌లైన్ ద్వారా గ్రీవెన్స్ నమోదు చేయవచ్చన్నారు. అంతేగాకుండా అభ్యంతరాలను, ఫిర్యాదులను తగిన ఆధారాలతో నంద్యాల సమగ్ర శిక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో సమర్పించాలన్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి 10 వేల క్యూసెక్కుల నీటి విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ మూడు గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటివిడుదలను కొనసాగిస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వరదనీటి ప్రవాహం నిలిచిపోయినట్లు తెలిపారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో డ్యాంలో 878.40అడుగుల వద్ద 179.8995 టీఎంసీల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద 877.40 అడుగుల నీటిమట్టం ఉండగా 4,5,6 గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్‌కు 8,000 క్యూసెక్కులు, తెలుగుగంగ కాల్వకు 2,000 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.
ఓపెన్ స్కూళ్లలో
ఎన్‌రోల్‌మెంట్ పెంచాలి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ఓపెన్ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ పెంచాలని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ నరసింహారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో జిల్లాలోని కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూళ్లలో విద్యార్థుల శాతం ఎక్కువగా నమోదు చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్ మాధ్యమాలు, టెస్టు బుక్స్ ద్వారా తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. వివిధ కారణాలతో చదువు మానేసిన పిల్లలకు, పెద్దలకు సార్వత్రిక విద్యాపీఠం ద్వారా చదువు కొనసాగించడానికి సువర్ణ అవకాశమన్నారు. సమావేశంలో డీఈఓ జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓలు శంకర్‌ప్రసాద్, సార్వత్రిక విద్యాపీఠం సమన్వయకర్త రఘురామిరెడ్డి, ఎంఈఓలు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.


