యాప్‌ల భారం తగ్గించాలి
సమస్యలు పరిష్కరించాలి
● ప్రతి విషయం ఆన్‌లైన్‌లో
నమోదు చేయాల్సిందే
● పని భారం.. ఒత్తిళ్లతో సతమతం
నంద్యాల(న్యూటౌన్): చదువులు చెప్పే ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం బోధనేతర పనుల బరువు మోపుతోంది. నానాటికీ ఈ భారం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. జిల్లాలో 1,345 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఆరు వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాలకు కొంత దూరం నుంచే తమ మొబైల్ ఫోన్ తీసి ముఖ హాజరు వేసుకుంటున్నారు. తర్వాత ప్రార్ధన అవుతుండగానే విద్యార్థుల మొత్తం సంఖ్యను లెక్కిస్తారు. అనంతరం తరగతులు వారీగా హాజరు నమోదు చేసి వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. తర్వాత మధ్యాహ్న భోజనం, టాయిలెట్ నిర్వహణ తనిఖీ చేసి మొబైల్స్ ద్వారా ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి వస్తోంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు ఓ వైపు ఆన్‌లైన్ పనులు చూసుకుంటూ మరో వైపు రెండు, మూడు తరగతులకు బోధన చేయాల్సి వస్తోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనైతే పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజులో సగం సమయం ఆన్‌లైన్ పనులకే కేటాయించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ఒకే పనిని రెండు సార్లు
అధికారులు సూచించిన ప్రతీ పనిని ఉపాధ్యాయులు అటు ఆన్‌లైన్‌లో ఇటు ఆఫ్‌లైన్‌లో చేయాల్సి వస్తోంది. పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన సమాచారం అంతా రికార్డుల్లో నిక్షిప్త పరచడమే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా వాటిని క్రమం తప్పకుండా పొందుపరుస్తూ రావాలి. ఒకే పనిని రెండు సార్లు చేయడంతో అధిక సమయం బోధనేతర పనులకే కేటాయించాల్సి వస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు వారాలవుతున్నా చాలా పాఠశాలల్లో ఇప్పటికీ ఒక్క పాఠం కూడా పూర్తికాని పరిస్థితి. మరో పది రోజుల్లో ఎఫ్‌ఎ–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థికి సంబంధించి సుమారు వంద అంశాల వివరాలను యు–డైస్‌లో అప్‌డేట్ చేసేందుకు సమయం సరిపోయింది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్కూల్ కిట్లు పంపిణీ తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ఉపాధ్యాయులు ఎలా చదువు చెబుతున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. టీచర్లతో క్లరికల్ వర్క్ చేయించడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
బడికి వచ్చినప్పటి నుంచి ముఖ హాజరుతో పాటు విద్యార్థులకు సంబంధించిన ప్రతీ అంశాన్ని యాప్‌ల్లో నమోదు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి సర్వర్ సమస్య వచ్చిన ప్పుడు గంటల కొద్దీ ఫోన్లు పట్టుకుని తిరగాల్సి వస్తోంది. దీని వల్ల భోధన సక్రమంగా చేయలేకపోతున్నాం. బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇచ్చి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేలా యాప్‌ల భారం తగ్గించాలి.
– శివయ్య, ఏపీటీఎఫ్ సెక్రటరీ, నంద్యాల
యాప్‌లతో బోధన సమయం వృథా అవుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాం. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. హామీలు అమలు చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తప్పించాలి. నిత్యం ఏదో ఒక పని చెప్పడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
– నగరి శ్రీనివాసులు,
ఏపీటీఎఫ్ 1938 సెక్రటరీ, నంద్యాల


