డోన్: వర్షపు నీటిని ఒడిసిపడదాం.. ప్రతి నీటి చుక్కను పొదుపు చేద్దాం.. నీటిని సంరక్షిద్దాం.. కరువు రక్కసిని తరిమికొడదాం అంటూ టీడీపీ నేతలు చెప్పే మాటలు నీటి మూటలుగా తేలిపోయాయి. గత వైఎస్సార్‌సీపీ హయాంలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని 36 చెరువులకు హంద్రీ నీవా కాల్వ నీటిని మళ్లించి సశ్యశ్యామలం చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాల పేరుతో చెరువులపై టీడీపీ నాయకుల పెత్తనం అధికం కావడంతో నీటి వినియోగం పట్ల నిర్లక్ష్యం పెరిగిపోయింది. దీంతో చెరువులన్నీ చుక్క నీరు లేక ఒట్టిపోయి కనిపిస్తున్నాయి.
గంపలో రొయ్యలేమయ్యాయి!
అంతా శాఖాహారులే మరి గంపలో రొయ్యలేమయ్యాయనే చందంగా నియోజకవర్గంలో చెరువుల పరిస్థితి తయారైంది. కొచ్చెర్వు, జగదుర్తి, యాపదిన్నె గ్రామ చెరువులను చేపల వేట పేరుతో నీటిని కిందకు వదిలి ఖాళీ చేయించారు. చెరువుల్లో నీరు ఎక్కువగా ఉంటే చేపల వేటకు కష్టతరమవుతుంది. అదే నీరు తక్కువగా ఉంటే చేపల వేట సులువుగా సాగించవచ్చు. దీంతో చెరువుల్లో నీరు ఖాళీ చేయించి తద్వారా టీడీపీ నేతలు ఈ ఏడాది చేపలు పట్టే వారి నుంచి వేలాది రూపాయలను అక్రమంగా వసూలు చేసి జేబులు నింపుకున్నారని ఆయా గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో నీటి నిల్వలను కాపాడి సక్రమంగా వినియోగించాల్సిన మైనర్ ఇరిగేషన్ అధికారుల్లో కొందరు మామూళ్ల మత్తులో పడి నీటి వృథాకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ చెరువుల్లో చేపల పెంపకం తమ పరిధిలో లేదంటూ మత్స్య శాఖ అధికారులు చేతులేత్తేయడంతో అనధికారికంగా ఈ చెరువుల్లో చేపల పెంపకం, విక్రయం లాంటి విషయాల్లో టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం పెరిగిపోయింది.
సిండికేట్ మాయాజాలం
అతి చిన్నదైన ఉడుములపాడు చెరువులో చేపల పెంపకాన్ని రెండేళ్లుగా బహిరంగ వేలం వేస్తున్న మత్స్యశాఖ అధికారులు వెంకటాపురం తుమ్మల చెరువు వేలం పాటను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తూ పచ్చ చొక్కాల నాయకుల జేబులు నింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే ఈ చెరువు తూమును దొంగలెత్తుకెళ్లినా ఇరిగేషన్ అధికారులు తిరిగి తూముకు అడ్డుకట్టు వేయలేకపోయారు. టీడీపీ నాయకులు, మత్స్యశాఖ, మైనర్ ఇరిగేషన్ అధికారుల్లో కొందరు కాసులకు కక్కుర్తి పడి చెరువుల్లో చుక్క నీరు నిల్వ లేకుండా చేపల వేటగాళ్లకు చేయూతనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, చెరువుల్లో నీరు లేకపోవడం లాంటి కారణాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయ బోర్లు వృథాగా మారాయి. పశువులకు సైతం తాగు నీరు దొరకని దైన్యస్థితి ఏర్పడింది.
మత్స్య శాఖ, మైనర్ ఇరిగేషన్
అధికారులతో కుమ్మక్కు
చేపల కాంట్రాక్టర్లకు
మేలు చేసేందుకు
చెరువులు ఖాళీ
జేబులు నింపుకుంటున్న
అధికార పార్టీ నాయకులు
చెరువు కథ కంచికి..
ఉమ్మడి జిల్లాలో సి.బెళగల్ చెరువు తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగి 501 ఎకరాల విస్తీర్ణం, 0.25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 112 ఏళ్ల చరిత్ర గత వెంకటాపురం తుమ్మల చెరువు కథ కంచికి చేరింది. ఈ చెరువు కింద 2 వేల ఎకరాల ఆయకట్టు, మరో 1500 ఎకరాల నన్‌ఆయాకట్టు సాగవుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల చెరువును నింపేందుకు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయితే ఈ చెరువు తూమును (గేట్) దొంగలెత్తుకెళ్లడంతో చెరువులో నీరంతా కిందకు వృథాగా పొతోంది. నీరు వృథా అవుతోందని ఆయకట్టు రైతాంగం నెత్తి, నోరు బాదుకున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా మారింది. మైనర్ ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుడడంతో చెరువులో నీరు త్వరలోనే ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడింది.


