పెన్సిల్‌పై స్వాతంత్య్ర యోధుల సూక్ష్మచిత్రాలు | - | Sakshi
Sakshi News home page

పెన్సిల్‌పై స్వాతంత్య్ర యోధుల సూక్ష్మచిత్రాలు

Aug 15 2026 1:51 AM | Updated on Aug 15 2026 1:51 AM

నంద్యాల(అర్బన్‌): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని

నంద్యాల చిత్రకారుడు

చింతలపల్లె కోటేష్‌ పెన్సిల్‌పై 40 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను గీసి అబ్బురపరిచారు. భారతమాత ముద్దుబిడ్డలైన సమరయోధులను దీవిస్తున్నట్లుగా భరతమాతతో కలిపి మొత్తం 40 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను పెన్సిల్‌పై చూపించారు. చిత్రంలో భగత్‌సింగ్‌, సుభాష్‌చంద్రబోస్‌, అల్లూరి సీతారామరాజు, తదితరుల చిత్రాలను చిత్రించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గోనెగండ్ల: మండల పరిఽధిలోని కున్నూరు గ్రామానికి చెందిన హరిజన ఆదాము (41) ఎస్‌.లింగందిన్నె క్రాస్‌ రోడ్డు వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. కున్నూరు గ్రామానికి చెందిన హరిజన ఆదాము, భార్య గిడ్డమ్మకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం ఆదాము సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై కోడుమూరు పట్టాణానికి వెళ్లాడు. తిరిగి రాత్రి కున్నూరు గ్రామానికి బయలు దేరాడు. అయితే ఎస్‌.లింగందిన్నె క్రాస్‌ రోడ్డు దగ్గరకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆదాము తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య గిడ్డమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

హంద్రీ నీవా కాల్వలో మృతదేహం లభ్యం

పత్తికొండ రూరల్‌: గుడికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి హంద్రీ నీవా కాల్వలో శవమై తేలాడు. ఘటనపై సీఐ జయన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హాలహర్వి మండలం కామినహాల్‌ గ్రామానికి చెందిన నాగార్జున (43) పత్తికొండకు చెందిన రమాదేవి అలియాస్‌ లక్ష్మి దంపతులు. కొద్దిరోజుల కిందట దంపతులు పత్తికొండకు వచ్చారు. ఈ క్రమంలో నాగార్జున రెండు రోజుల క్రితం పత్తికొండ – చిన్నహుల్తి రోడ్డులోని ఈరన్న స్వామిని దర్శించుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో భార్య పత్తికొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గోపాల్‌ ప్లాజా సమీపంలోని హంద్రీ కాలువ గట్టున చెప్పులు, బైక్‌ పడి ఉండటాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు హంద్రీ నీవా కాల్వలో జారిపడి ఉండొచ్చని భావిస్తున్నారు. శుక్రవారం మద్దికెర మండలం హంప వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో జైలు శిక్ష

డోన్‌ రూరల్‌: డోన్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి 2 రోజులు జైలు శిక్ష విధించారు. మండలంలోని తాటిమాను కొత్తూరు గ్రామానికి చెందిన ఆర్‌.శేఖర్‌కు 2 రోజులు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం డోన్‌ స్పెషల్‌ జ్యుడీషయల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు రూరల్‌ సీఐ రాకేష్‌, ఎస్‌ఐ మమత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement