మహానంది: మండలంలో సుమారు 15 గొర్రెలను ఎత్తుకెళ్లిన వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు మహానంది ఎస్‌ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లాకు చెందిన కాపరులు దివిటె గౌడప్ప, ముత్తప్ప, కర్రెప్పలు తమ జీవాలను మహానంది మండలం గాజులపల్లె రైల్వేస్టేషన్ గ్రామ పొలాల్లో పగలు మేపుకొని రాత్రికి గ్రామ పొలిమేరలో ఉన్న ఖాళీ పొలంలో ఉంచుకునేవారు. అయితే ఈ నెల 9, 10వ తేదీ రాత్రివేళల్లో గొర్రెల కాపర్లు ఏర్పాటు చేసుకున్న కంచెను కట్ చేసి రూ.1.50 లక్షల విలువైన 15 గొర్రెలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటనపై గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అందులో భాగంగా నంద్యాల మండలం చాపిరేవుల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కుందూ నదికి వెళ్లే మట్టి దారిలో బేతంచెర్ల మండలం బుగ్గనిపల్లె గ్రామానికి చెందిన రామావత్ ధర్మానాయక్, పాణ్యంకు చెందిన జయంపు మహేష్, తోట కొత్తూరయ్యను అరెస్టు చేసి వారి నుంచి 15 గొర్రెలతో పాటు ఒక స్కార్పియో వాహనం, వైర్ కటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును చేధించి దొంగలను అరెస్టు చేసిన మహానంది ఎస్‌ఐ రామ్మోహన్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ సునీల్ షెరాణ్, ఏఎస్పీ సుస్మిత అభినందించారు.


