మహానంది: మహానందిలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వర సదనం వసతి గృహాల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారు. మంగళవారం ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, ముఖ్య అర్చకులు రాజమాణిక్యశర్మ, మణికంఠశర్మ హైదరాబాద్‌లో పలువురు భక్తులను కలిశారు. హైదరాబాద్‌కు చెందిన డి.సుబ్రహ్మణ్యం, సంధ్యారాణి దంపతులు సూట్ రూమ్ నిర్మాణానికి రూ. 15 లక్షల చెక్కును వారికి అందించారు. అలాగే కూకట్‌పల్లిలో ఉంటున్న సన్నిధి సురేష్‌బాబు, లత దంపతులు రూ. పది లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చి అందులో భాగంగా రూ. 2.50 లక్షలు మొదటి విడతగా చెల్లించారు. గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలకు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. వసతి గృహాల నిర్మాణానికి దాతలు సహకరిస్తుండటం శుభపరిణామమని ఈఓ అన్నారు.
గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మృతి
మహానంది: మండల ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కవిత (45) గుండెపోటుతో మృతి చెందారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన సూపర్‌వైజర్ కవిత మంగళవారం అంగన్‌వాడీ టీచర్లకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమానికి స్థానిక ఏపీ మోడల్ స్కూల్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం సమావేశానికి వెళ్లిన ఆమె పాఠశాలలో ప్రేయర్ అనంతరం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, రిసోర్స్ పర్సన్స్, అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడుతుండగానే రెయిలింగ్‌పై కుప్ప కూలిపడిపోయింది. వెంటనే ఉపాధ్యాయులు కారులో నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. కవిత మృతి విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ లీలావతి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రూ. 25 వేలు అందించారు. ఎంఈఓ రామసుబ్బయ్య, ఏపీ ఎన్‌జీఓల సంఘం జిల్లా నాయకులు హుసేన్‌రెడ్డి, తదితరులు కవిత మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మాకు తెలుసులే..
రోడ్లు ఎక్కడేయాలో!
● సమస్యను విన్నవించిన ప్రజలతో
ఎమ్మెల్యే జయసూర్య
జూపాడుబంగ్లా: ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి దండాలు పెట్టి ఓట్లు అడిగిన నాయకుడు.. గెలిచిన తర్వాత అదే ప్రజలను చులకనగా మాట్లాడటం చూసి జూపాడుబంగ్లా ప్రజలు ఆశ్చర్యపోయారు. మంగళవారం జూపాడుబంగ్లాలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసానగర్ కాలనీలో సిమెంటు రోడ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నామని త్వరగా రోడ్లు నిర్మించి పుణ్యం కట్టుకోవాలని కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరారు. అయితే ‘మాకు తెలుసులేవయ్యా...ఎక్కడెక్కడ రోడ్లు లేవో, దెబ్బతిన్నాయో తెలుసు.. కొత్తరోడ్లు వేయించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మంజూరైన వెంటనే నిర్మిస్తామంటూ’ బదిలివ్వటంతో కాలనీవాసులు షాక్‌కు గురయ్యారు. అలాగే తమ కాలనీలో తాగునీటి ఇక్కట్లు తీర్చి పుణ్యం కట్టుకోండంటూ క్వార్టర్స్ కాలనీవాసులు మొర పెట్టుకున్నారు. ముస్లిం కాలనీలో శిథిలమైన 40 ఏళ్ల క్రితం నాటిని ట్యాంకును పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్, ఎంపీడీఓ గోపికృష్ణ, ఏఈ లు బషీర్, నాగేంద్రబాబు, ఏఓ కృష్ణారెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


