శ్రీశైలంటెంపుల్: సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఐదు రోజుల పాటు శ్రీశైల దేవస్థానంలో నిర్వహించిన వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేక క్రతువులు పూర్ణాహుతితో ముగిశాయి. మంగళవారం స్వామివారి ఆలయంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు రుష్యశృంగ జపం, వారుణానుక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వ పారాయణలు, పంచాక్షరి జపం మొదలైనవి జరిపించారు. అలాగే యాగశాల ప్రవేశం, ఏకాదశ రుద్ర రుష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, రుద్రహోమం, చండీపారాయణ, శ్రీచక్రార్చన, నవావరణార్చన విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. చివరి రోజు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.


