శ్రీశైలంటెంపుల్: ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వర్ణరథారూఢులైన శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. సోమవారం వేకువజామున స్వామిఅమ్మవార్లకు అర్చకులు వైదికపరమైన విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథంపై కొలువై ఉన్న స్వామిఅమ్మవార్లకు పూజలు చేపట్టారు. సహస్ర ఘటాభిషేక విశేష పూజలు నిర్వహిస్తున్నందున స్వర్ణరథోత్సవ ఊరేగింపును నిలుపుదల చేశారు. ఈ పూజల్లో దేవదాయశాఖ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, ధర్మకర్తల మండి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 121 వినతులు
బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ సునీల్ షోరాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి 121 వినతులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాటాడి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా స్టేషన్ల పోలీసులు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. బాధితుల ఫిర్యాదుల పట్ల అధికారులు అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించిన వెంటనే జిల్లా కార్యాలయానికి సమాచారం చేరవేయాలని సూచించారు.
వీబీఆర్‌కి 4 వేల క్యూసెక్కులే
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తెలుగుగంగ ప్రాజెక్టు లింక్ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో వీబీఆర్‌లో 3.322 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 264.70 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 253.54 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.32 టీఎంసీలుగా ఉంది. తెలుగుగంగ లింక్ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి ప్రస్తుతం ఎలాంటి నీటి ప్రవాహం లేదు. వీబీఆర్ నుంచి సగటున 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.
ప్రజా వినతులపరిష్కారంలో నిర్లక్ష్యమొద్దు
నంద్యాల: ప్రజల వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించా రు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూర జ్ ధనుంజయ్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందుతున్న ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. అలాగే రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా మొత్తం 165 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.


