నీటితీరువా సక్రమంగా చెల్లించటం లేదు
జూపాడుబంగ్లా: ఎత్తిపోతల పథకాల పనితీరు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈనెల 7వ తేదీన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య జూపాడుబంగ్లా–1, 2 ఎత్తిపోతల పథకంలోని రెండు మోటార్ల స్విచ్ఛాన్ చేసి రైతులకు సాగునీటిని విడుదల చేశారు. అయితే మూడు రోజులకే జూపాడుబంగ్లా–1లోని మోటారు స్విచ్ఛాఫ్ కావటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011లో రూ.84.46 కోట్లతో పారుమంచాల, తంగడంచ, పి.లింగాపురం, తరిగోపుల, 80 బన్నూరు గ్రామాల్లోని 9,289 ఎకరాలకు సాగునీరు అందించేందకు ఒక్కో మోటారు 25 క్యూసెక్కుల సామర్థ్యంతో ఐదు మోటార్లతో జూపాడుబంగ్లా–1, 2 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. నీటిపంపింగ్ మోటార్లు, విద్యుత్ బిల్లులు, విద్యుత్ సబ్‌స్టేషన్ల మరమ్మతులు మినహా మిగిలిన మైనర్ రిపేర్లు ఆయకట్టు రైతులు నీటితీరువా వసూలుతో చేయించుకోవాల్సి ఉంది. పొలాలకు నీటిని పారించుకొన్న తర్వాత రైతులు నీటితీరువా సక్రమంగా చెల్లించకపోవటంతో ఎత్తిపోతల పథకాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. జూపాడుబంగ్లా–1 పథకం కింద మూడు మోటార్లు ఉండగా ప్రస్తుతం ఓ మోటారు మినహా మిగిలిన రెండు మోటార్లు మరమ్మతులకు గురయ్యా యి. మిగిలిన ఓ మోటారు 60 శాతం మాత్రమే పనిచేస్తుండగా దాంతో మాత్రమే నీటిని పంపింగ్ చేసుకుటుండంతో పథకం కిందున్న 5,200 ఎకరాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. బంగ్లా–2 పథకంలో రెండు మోటార్లు ఉండగా ఓ మోటారు మరమ్మతులకు గురవ్వగా ప్రస్తుతం ఓ మోటారు ద్వారా మాత్రమే సాగునీటిని పంపింగ్ చేస్తుండగా 4,089 ఎకరాల్లో కేవలం 30 శాతం మేర సాగునీరు అందుతోంది.
ప్రతిపాదనలకు పరిమితమైన
నిధుల మంజూరు
జూపాడుబంగ్లా–1, 2 ఎత్తిపోతల పథకాల మోటార్ల మరమ్మతుల కోసం ఏపీఎస్‌ఐడీసీ అధికారులు రూ.3కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఇప్పటిదాకా నిధులు మంజూరు కాలేదు. నెలరోజుల క్రితం కలెక్టర్ రాజకుమారి గణియా తంగడంచ చెరువును పరిశీలించడానికి రాగా రైతులు ఆయకట్టు దుస్థితిని వివరించారు. దీంతో ఎత్తిపోతల పథకం మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని రైతులకు హామీనిచ్చారు. వెంటనే ఏపీఎస్‌ఐడీసీ అధికారులు రూ.8 లక్షలకు ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి వసతి ఉన్నా పంటలు సాగు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే ప్రారంభించిన
మూడు రోజులకే మొరాయించిన
ఎత్తిపోతల–1 మోటార్లు
ఎత్తిపోతల –2లో ఒక మోటారు ద్వారా
మాత్రమే నీటి పంపింగ్
కలెక్టర్ హామీ ఇచ్చినా నిధులు నిల్
సాగునీరందక ఆయకట్టు రైతుల
ఆందోళన
ఎత్తిపోతల పథకం నీటితో పంటలు సాగు చేసుకున్న రైతులు నీటితీరువా చెల్లించటం లేదు. దీంతో మైనర్ రిపేర్లు కూడా చేసుకోవడం కష్టమవుతోంది. మరమ్మతులకు గురైన మోటార్ల రిపేరీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం జూపాడుబంగ్లా–2లో ఒక మోటారు ద్వారా మాత్రమే నీటిని పంపింగ్ చేస్తున్నాం.
– సాంబశివుడు, ఏపీఎస్‌ఐడీసీ టీఏ


