కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ నూనెగింజల అభివృద్ధి పథకం కింద రైతులకు వంద శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. కొందరు అధికారుల ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని అమలు చేశారనే విమర్శలు వచ్చాయి. డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అవినీతి, అక్రమాలు సీఎం కార్యాలయం దృష్టికి కూడా వెళ్లాయి. కర్నూలు జిల్లాలో కర్నూలు సబ్ డివిజన్‌లోని మండలాలు, చిప్పగిరి, కౌతాళం, నందవరం మండలాలు మినహా 16, నంద్యాల జిల్లాలో మూడు(ప్యాపిలి, డోన్, బేతంచెర్ల) మండలాల్లో ఈ పథకం అమలవుతోంది. రైతులకు వంద శాతం సబ్సిడీతో టీసీజీఎస్–1694(విశిష్ట) రకం వేరుశనగ విత్తనం కాయలను పంపిణీ చేయాలి. కర్నూలు జిల్లాలో 2 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు 3,000 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 1,000 హెక్టార్లలో సాగు చేసేందుకు 1,500 క్వింటాళ్ల ప్రకారం కేటాయించారు. వ్యవసాయ అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కుమ్మకై ్క వేరుశనగను దారిమళ్లించారు.
పర్యవేక్షణ లేక..
సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలను డి–క్రిషి యాప్ ద్వారా రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ అధికారులు తమకు కావాల్సిన రైతుల పేర్లను డి– క్రిషి యాప్‌లో నమోదు చేశారు. రెండు మండలాల్లో కొంత మేర పంపిణీ కాగా .. మిగిలిన చోట్ల దారిమళ్లించారు. పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి, అక్రమాలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 4,500 క్వింటాళ్ల విశిష్ట రకం వేరుశనగను కేటాయిస్తే కేవలం 10 శాతం పంపిణీ చేశారు. అది కూడా పంపిణీ చేసినట్లు అనిపించుకోవడానికి ఫొటోలు దిగేందుకు మాత్రమే అని తెలుస్తోంది. మొత్తం 4,000 క్వింటాళ్లకుపైగా బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల క్వింటా ధర రూ.10200 ఉండా ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. ఉమ్మడి జిల్లాకు రూ.4.59 కోట్ల వ్యయంతో సరఫరా చేయగా..రూ.3 కోట్ల విలువైన వీటిని దారిమళ్లించి జేబులు నింపుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వ్యాపారులకు అమ్మేసి..
విశిష్ట రకం వేరుశనగ విత్తన కాయలను హెచ్‌సీఎల్ కంపెనీ సరఫరా చేసింది. వీటిని రైతులకు పూర్తి సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేయాలి. అయితే వ్యాపారులకు క్వింటా రూ.7,000 నుంచి రూ.8,000 ధరతో అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. పథకాలను పకడ్బందీగా అమలు చేయడంలో జిల్లా, డివిజినల్ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షించాల్సిన అధికారులే చూసీనట్లు వ్యవహరించడంతో హెచ్‌సీఎల్ కంపెనీ నుంచి కమిషన్లు వసూలు చేశారు. తొలుత ఈ కంపెనీ రెండు లారీల విత్తన కాయలను సరఫరా చేసింది. కమిషన్ల ఒప్పందం ఖరారు కాకపోవడంతో నాణ్యత లేదనే కారణంతో తిప్పి పంపారు. కమిషన్లు అందడంతో వెనక్కి పంపిన దాన్నే తిరిగి తీసుకున్నారు.
పక్కదారి పట్టిన జాతీయ
నూనె గింజల అభివృద్ధి పథకం
రూ.4.59 కోట్ల వేరుశనగ
4,500 క్వింటాళ్లు సరఫరా
పంపిణీ ఫొటోలకు పరిమితం
బ్లాక్ మార్కెట్‌కు 90 శాతం వేరుశనగ
రూ.3 కోట్లకుపైగా దండుకున్న వైనం


