రూ.100 స్టాంపుపై రాసిస్తేనే జీతాలు ఇస్తారంట
ఫిర్యాదులు రావడంతోనే
తొలగించాం
గత 25 సంవత్సరాలుగా ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేశాం. మోటార్ పాడైనా, పైపులైన్ పగిలినా అర్ధరాత్రి, తెల్లవారు జామున, వర్షం వచ్చినా, చలి పెడుతున్నా ఆగలేదు. నెలల తరబడి జీతాలు ఇవ్వక పోయినా అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొచ్చాం. ఇటీవల ఘుగర్ ఎక్కువై కాలు తీశేశారు. ఈ సమయంలో ఉన్న ఫలంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఎలా? ఏం తినాలి? ఎలా బతకాలి? 25 ఏళ్లుగా గ్రామ పంచాయతీకీ చేసిన సేవకు ఇదేనా అధికారులు మాకిచ్చే బహుమానం?.
– ఇర్ఫాన్
25 ఏళ్లుగా మాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఏదైనా ఆ వీధిలో నీళ్లు రాలేదు, ఇక్కడ పైపులైన్ లీక్ అయింది.. అని ఫిర్యాదులు వస్తాయి. అధికారులు చెబితే వెంటనే అక్కడకు వెళ్లి పునరుద్ధరించడం జరుగుతుంది. ఇన్నేళ్ల చరిత్రలో ఎవరూ మమ్మలను ఉద్యోగంలో నుంచి తీసేయమని ఫిర్యాదు చేయలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కేవలం మమ్మలను తొలగించేందుకు రాజకీయ కుట్ర చేశారు. వయస్సంతా ఇక్కడే అయిపోయింది. ఈ వయస్సులో ఏం పనిచేస్తాం.
– ఎస్. ఫారూక్
ఆళ్లగడ్డ: అబద్ధాలు చెప్పి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలు రోజురోజుకు పరాకాష్టకు చేరుతున్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖల్లో అల్ప వేతనాలకు అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే చిరు ఉద్యోగులకు రాజకీయ రంగు పులిమి రోడ్డున పడేస్తోంది. చాగలమర్రి మేజర్ గ్రామ పంచాయతీలో తెలుగు దేశం పార్టీ నేతలు అధికార బలంతో సామాన్య కార్మికుల పొట్ట గొట్టి వారి స్థానాల్లో తమ అనుచరులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పావులు కదిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ తాగు నీరు అందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పాతికేళ్లుగా రాత్రింబవళ్లు పనిచేసే 13 మంది తాగునీటి కార్మికుల (వాటర్ వర్కర్స్, పంప్ ఆపరేర్లు)పై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా వారిని తొలగించి తమ వారికి ఈ పోస్టులను అమ్ముకోవాలన్న ‘పచ్చ’ కుట్రతో అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నేతలకు గులాంలా మారిన అఽధికారులు మానవత్వాన్ని తుంగలో తొక్కి 13 మంది చిరుద్యోగులను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల్లోంచి తొలగించారు. దీని వెనుక పెద్ద రాజకీయ దుశ్చర్య దాగి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నేతలు ఆదేశించారు.. అధికారులు పాటించారు
చాగలమర్రి మేజర్ గ్రామ పంచాయతీలో 2000లో నాసిర్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 13 మంది నీటి సరఫరా ఉద్యోగులు, ముగ్గురు వీధి దీపాల నిర్వహణ సిబ్బందిని తీసుకున్నారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా.. స్థానికంగా ఎవరు అధికారంలోకి వచ్చినా వీరినే రెన్యువల్ చేస్తూ కొనసాగిస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు నీటి సరఫరా చేస్తున్న 13 మందిని తొలగించి వారి స్థానంలో అనుచరులను నియమించి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి సిబ్బందిని పిలిచి ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నామని చెప్పడంతో చిరుద్యోగులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాతికేళ్ల సుదీర్ఘ సర్వీసును కూడా లెక్కచేయకుండా, పేద కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసేందుకు కుట్రలు పన్నడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చక్రం తిప్పుతున్న కంప్యూటర్ ఆపరేటర్
ప్రస్తుతం నాసిర్ ఏజెన్సీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ప్లేట్ ఫిరాయించి అధికార పార్టీకి జై కొట్టాడు. అంతే ఇన్ని రోజులు జీతం ఏజెన్సీ ని రద్దు చేసి కొత్తగా అధికార పార్టీ నేతకు సంబందించిన ఏజెన్సీని రిజిస్టర్ చేయించడంతో పాటు వారికే టెండర్ వచ్చేలా చేశారు. అంతే ఈ 13 ఉద్యోగాలకు ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు బేరం కూడా అతడే కుదర్చడంతో పాటు అందులో ఎవరికి ఎంత అని పంపకాలు రాసిపెట్టుకున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా కేవలం ఉద్యోగాలను అమ్ముకోవడానికే చిరుద్యోగులపై వైఎస్సార్ ముద్ర వేసి తొలగించడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుల అరియర్స్‌తో ఐఫోన్ గిఫ్ట్
పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన అరియర్స్ నిధులను కంప్యూటర్ ఆపరేటర్ స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ అక్రమానికి అడ్డు రాకుండా ఉండేందుకు ఆ డబ్బుతోనే ఓ అధికారికి సుమారు రూ. 1.40 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ కూడా ప్రస్తు తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కావడం గమనార్హం.
కోర్టు తీర్పులంటే లెక్కే లేదు..
కార్మికుడిపై ఫిర్యాదు వస్తే.. తప్పు చేశాడని భావిస్తే అధికారి ప్రొసిజర్ ప్రకారం చార్జ్ మెమో ఇవ్వడం, వివరణ కోరడం ప్రాథమిక నియమం. ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించ డం సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన అని, అది చాలా పెద్ద శిక్ష అని ఇటీవల ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) సైతం ఇలాంటి కేసుల్లో అధికారులకు మొట్టికాయలు వేసింది. అయినా చాగలమర్రి పంచాయతీ అధికారులు, టీడీపీ నాయకులు ఆ తీర్పులను పూర్తిగా తొంగలో తొక్కారు.
అలా.. ఎలా?
ఎక్కడైనా ఉద్యోగులు సక్రమంగా పని చేయలేదంటే వారిపై అప్పుడప్పుడు ఫిర్యాదులు రావడం సహజంగా జరుగుతుంటుంది. అయితే చాగలమర్రి పంచాయతీలో మాత్రం ఒకే రోజు గత నెల 17వ తేదీ మొత్తం 13 మంది సిబ్బందిపైనా 13 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని అదే రోజు విచారించి వీరు తప్పు చేసినట్లు ధ్రువీకరించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపడం, మరుసటి రోజే వీరిని విధుల నుంచి తొలగించడంతో పాటు కొత్త ఎజెన్సీకి అనుమతి ఇవ్వడం పై ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఉన్నట్టుండి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 13 మందిని తొలగిస్తున్నామని ఈఓ చెప్పారు. ఎందుకు అంటే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. సరే మాకు రావాలిసిన 3 నెలల జీతమైనా ఇవ్వండి అంటే.. జీతం ఇవ్వాలంటే రూ. 100 స్టాంపుపై మేము కోర్టుకు వెళ్లం, ఏ రాజకీయ పార్టీల నాయకుల దగ్గర పంచాయితీ పెట్టమని రాసి స్తే జీతాలు ఇస్తామంటున్నారు. ఒక వేళ కోర్టుకు పోతే మాకు ఇవ్వాల్సిన జీతాలతోనే కోర్టు ఖర్చులు పెట్టుకుంటామని అధికారులు బెదిరిస్తున్నారు. – ఫారూక్
16 మంది సక్రమంగా పనిచేయలేదని రాత పూర్వకంగా ఫిర్యా దులు వచ్చాయి. గత సెక్రటరీ వాటిని విచారించి జిల్లా అధికారులకు నివేదికలు సమర్పించడంతో కాంట్రాక్ట్ రద్దు చేసి వేరే వారికి అప్పగించడం జరిగింది. అయితే ఇందులో తక్కువ ఫిర్యాదులు వచ్చిన వారిని మళ్లీ కొత్త ఏజెన్సీ ద్వారా కొనసాగిస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న జీతాలు త్వరలో ఇస్తాం.
– సబియాబేగం, పంచాయతీ సెక్రటరీ


