● మాజీ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్: మోసాలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి అధోగతి పాలైందన్నారు. సూపర్ సిక్స్ హామీల మాటున అనేక బూటకపు వాగ్దానాలను ఇచ్చి ప్రజలను మభ్య పెట్టారన్నారు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రతి నెలా 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4 వేల పింఛన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చి 60 ఏళ్లపైబడిన వారిలో ఒక్కరికై నా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఆచరణ యోగ్యం కాని హామీలిచ్చి మహిళలను మరోసారి మోసగించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందన్నారు.
ర్యాలీని విజయవంతం చేయండి..
డీఎస్సీ – 2025లో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమ వారం డోన్ పట్టణంలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కొత్తబస్టాండ్ సమీపంలోని మధు ఫంక్షన్ హాల్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ కంబాలపాడు సర్కిల్, పాతబస్టాండ్ మీదుగా సమైక్యాంధ్ర కట్ట వద్దకు చేరుకుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులు, యువత, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కావాలన్నారు.


