● అటకెక్కిన జలాశయ మరమ్మతులు
● పూర్తిగా దెబ్బతిన్న రిజర్వాయర్ కట్ట
● గోరుకల్లులోకి వచ్చిన కృష్ణా జలాలు
పాణ్యం: రాయలసీమకు సాగు, తాగు నీటిని తరలించడంలో కీలకమైన గోరుకల్లు రిజర్వాయర్ పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. బనకచర్ల క్రాస్ రెగ్యులేర్ నుంచి ఎస్సార్బీసీకి రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా అవి ఆదివారం గోరుకల్లు జలాశయానికి చేరాయి. తాగునీటి అవసరాల నిమిత్తం ఈ ఏడాది జలాశయంలో మూడు టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు రిజర్వాయర్ కట్ట రివిట్మెంట్ తాత్కాలిక పనులు పది శాతం కూడా పూర్తికాలేదు. ఈ జలాశయం సామర్థ్యం 12.4 టీఎంసీలు కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 11.2 టీఎంసీల నీటిని నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది కట్ట కుంగిపోవడం ప్రారంభమైంది. ఈ కట్టను పరిశీలించేందుకు ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చి చూసి తాత్కాలిక పనులకు డీఎంఎప్ నిధుల కింద రూ. 2.50 కోట్లు మంజూరు చేశారు. అయితే ఈ పనులను గత నెలలో ప్రారంభించారు. ఓటీ రెగ్యులేటర్ వద్ద కుంగిన కట్టను పూర్తి చేయలేదు. దాదాపుగా ఐదు ప్యానెళ్లు దెబ్బతిన్న కట్ట పది అడుగులపైగానే కుంగిపోయింది. కేవలం రెండు ప్యానెళ్లు మాత్రమే పూర్తి చేశారు.
నిర్వహణ గాలికి!
గోరుకల్లు జలాశయం నిర్వహణను గాలికొదిలేశారు. కట్టపై కనీసం కంపచెట్లు తొలగించలేదు. అంతేగాక కట్టకు భారీగా నెర్రలిచ్చాయి. దాదాపు 10 అడుగులపైగానే గోతులు పడ్డాయంటే నిర్వహణ ఎంత మాత్రంగా ఉందో అర్థమతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 60లక్షలు ఖర్చు చేసి కట్టపై కంపచెట్లు తొలగించారు. అంతేగాక కట్ట రివ్యూట్మెంట్ పనులు పూర్తి చేయించారు. ప్రస్తుతం ఈ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం గోరుకల్లులో 2.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి.
ఎక్కడి పనులు అక్కడే!
పనులు పూర్తికాకుంటే గోరుకల్లు భద్రతకు అటంకం కలుగుతుందని నిపుణులు కమిటీ నిర్ధారించింది. తక్షణమే పనులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే మంత్రి పరిశీలిన తర్వాత పెండింగ్ పనులకు రూ. 53కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు కేటాయించి దాదాపుగా ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో జలాశయ భద్రత దేవుడికెరుక అన్నట్లు తయారైంది. పనులు పూర్తికాకపోవడంతో తరచూ సమస్య నెలకొంటోందని సీనియర్ ఇంజినీర్లు అభిప్రాయ పడుతున్నారు.


