శ్రీశైలంప్రాజెక్ట్: జూరాల నుంచి శ్రీశైలంకు వస్తున్న వరద ప్రవాహం ఆదివారం పడిపోయింది. గత కొద్ది రోజుల వరకు 2.11 లక్షల పైచిలుకు ఉన్న ఇన్‌ఫ్లో శనివారం 1.68 లక్షలకు పడిపోయింది. ఆదివారం జూరాల నుంచి కేవలం 44,279 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 60,177 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగార్జునసాగర్‌కు 48,511 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,917 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 8,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,611 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.883 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 11.400 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 181.0590 టీఎంసిల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 878.60 అడుగులకు చేరుకుంది.
పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా రెండు రోజుల రెండో శనివారం, ఆదివారం సెలవులు కలసి రావడంతో భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి.
క్వింటా వేరుశనగ రూ.8,702
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.8,702 ధర లభించింది. మార్కెట్‌కు 2,932 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.2,100, మధ్యస్థ ధర రూ.6,230 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.


