● ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న జననేత
కల్లూరు: అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లపై కల్లూరులో ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఇసాక్‌బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం సమీక్షించారు. అనంతరం ఆ వివరాలను పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విలేకరులకు వివరించారు. గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఆగస్టు 13న చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కర్నూలులోని పంచలింగాల సబ్‌జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షి వద్దకు వెళ్తారన్నారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకులను పరామర్శిస్తారని తెలిపారు. ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నాయకులకు
ధైర్యాన్ని ఇచ్చేందుకే..
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చివరికి ఎమ్మెల్యేలపై కూడా అక్రమ కేసులు నమో దు చేస్తున్నారని కాటసాని ఆరోపించారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేరుగా వస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నాయకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడొద్దనే సందేశాన్ని ఇచ్చేందుకు తమ పార్టీ అధినేత వస్తున్నారని తెలిపారు. పోలీసు వ్యవస్థను రాజకీయాలకు వినియోగించుకుంటూ సామా న్య ప్రజలపై కూడా నేడు కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. హద్దులు దాటి విధులు నిర్వహించే అధికారులు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ నాయకుల అక్రమ కేసులు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటంతోపాటు ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శ్రీదేవి, గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ మేయర్ బీవై రామయ్య, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు రాజీవ్‌రెడ్డి, ధారా సుధీర్, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, ఆదిమూలపు సతీష్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి, మంత్రాలయం నేత ప్రదీప్‌రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


