ఇకపై డ్రోన్ పెట్రోలింగ్
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఇప్పటివరకు రాత్రి, పగలు ఆయా స్టేషన్ల పరిధిలో క్యూఆర్‌టీ, బ్లూ కోల్ట్స్ వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా మరో మూడు డ్రోన్ కెమెరాలను జిల్లాకు ఆ శాఖ ఉన్నతాధికారులు కేటాయించడంతో వీటి సేవలను పెట్రోలింగ్‌కు వినియోగించనున్నారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన మూడు డ్రోన్ కెమెరాలతో పాటు దాతలు రెండు డ్రోన్ కెమెరాలను సమకూర్చారు. తాజాగా ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ (డీజీపీ ఆఫీస్) నుంచి మరో మూడు నూతన డ్రోన్ కెమెరాలను కేటాయించగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా స్మార్ట్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీసు శాఖ ముందడుగు వేస్తోంది. ఉత్సవాలు, పండుగలు, వేడుకలు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చే సందర్భాల్లో పోలీసు శాఖకు సాంకేతికత మరింత దోహదపడుతోంది. ఇందులో భాగంగా కొంతకాలంగా డ్రోన్ కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలల వద్ద డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు.


