పెద్ద హరివాణం.. రగిలిన ఉద్యమం
ఆదోని రూరల్: ఓ వైపు ఆదోని మండలంలో 16 గ్రామాల ప్రజలు ప్రత్యేక మండలం వద్దంటూ నెల రోజులుగా ఆందోళన చేస్తున్న తరుణంలో గెజిట్ ప్రకా రం పెద్ద హరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామ స్తులు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అతి పెద్ద మండలమైన ఆదోనిని రెండు మండలాలుగా విభజిస్తూ పెద్దహరివాణం గ్రామా న్ని మండల కేంద్రంగా ప్రకటించింది. అయితే పెద్దహరివాణం మండలంలో విలీనానికి ప్రతిపాదించిన 16 గ్రామాల ప్రజలు నెల రోజులుగా ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసి ఆదోని–1, ఆదోని–2గా ప్రకటించడంతో మంగళవారం పెద్దహరివాణం గ్రామ ప్రజలు కన్నెర్రజేశారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మంగళవారం గ్రామస్తుడు ఆది నారాయణరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా గ్రామస్తులు ఆదోని – సిరుగుప్ప రహదారులను దిగ్బంధం చేసి రాకపోకలను నిలిపివేశారు. అలాగే టైర్లు, పాత వాహనాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పెద్దహరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు పోరాడుతామని నినాదాలు చేశారు.


