29న ‘రెవెన్యూ’ క్లినిక్స్
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో మొత్తం ఏడు రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్లినిక్స్‌లో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత అర్జీలను స్వీకరించి, వాటిని నమోదు చేసి, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాలకు చెందిన ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.
శ్రీశైల క్షేత్రానికి ఒకే రోజు రూ.1.4 కోట్ల ఆదాయం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా శుక్రవారం ఒక్క రోజురూ.1,46,94,825 ఆదాయం వచ్చిందని శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో స్పర్శదర్శనం, రూ. 300 అతి శీఘ్రదర్శనం, రూ. 150 శీఘ్రదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మొత్తం 14 ఆర్జితసేవలకు సంబంధించిన టికెట్లు కూడా ఆనన్‌లైన్‌న్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా దర్శనం, ఆర్జితసేవలు పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా శుక్రవారం దేవస్థానానికి రూ. 73,19,314, ఆఫ్‌లైన్ ద్వారా రూ.73,75,511 ఆదాయం వచ్చిందన్నారు.


