వేగంగా పాత గేట్ల తొలగింపు పనులు
హొళగుంద: తుంగభద్ర జలాశయంలో 33 పాత గేట్ల తొలగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తవగానే నెలలో ఆరు గేట్ల ప్రకారంగా కుడి, ఎడమ, మద్య భాగాలలో మొత్తం మూడు బృందాలు 2026 మే నెల కల్లా 33 గేట్ల బిగింపు పనులు పూర్తి చేస్తారు. పనులకు వీలుగా డ్యాంలో నీటిని నదికి వదిలి నిల్వ సామర్థ్యాన్ని 40 టీఎంసీల వరకు తగ్గించారు. డ్యాంకు శనివారం ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. జనవరి 10 లేదంటే మరి కొద్ది రోజులు మాత్రమే కాలువలకు నీటిని వదలనున్నారు. అనంతరం నీటి సరఫరా బంద్ చేయనున్నారు. ప్రస్తుతం దిగువ కాలువ 250 కి.మీ వద్ద 647 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.
రూ.1.50లక్షలు పలికిన పొట్టేలు!
కోసిగి: పందెం పొట్టేలు రూ.1.50 లక్షలు పలికింది. మండల కేంద్రం కోసిగిలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని గవిగట్టు నారాయణ, కృష్ణ ఈ ఏడాది దేవర ఉత్సవాల కోసం మార్చిలో రూ.40వేలకు ఓ పొట్టేలు కొని పెంచుకున్నారు. రోజూ లీటరు పాలు, 4 కోడిగుడ్లు, కేజీ ఉలువలను ఆహారంగా అందించారు. ఉత్సవాలు వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో విక్రయించాలని నిర్ణయించుకోగా, మద్దికేర మండలం ఆగ్రహానికి చెందిన ఈరన్న అనే రైతు రూ.1.50లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని బరువు 120 కేజీలు.


