రైతులకు కడ‘గండ్లు’
రుద్రవరం: తెలుగుగంగ ఉప ప్రధాన కాల్వకు పడిన గండ్లను అలాగే వదిలేయడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఖరీఫ్‌లో చేతికొచ్చిన పంటను కోయకుండా పొలాల్లో వదిలేశారు. విత్తనం వేయాల్సిన పొలాలను బీళ్లుగా ఉంచుకున్నారు. రుద్రవరం మండల పరిధిలోని టి.లింగందిన్నె–ఆర్. నాగులవరం మధ్య 22వ బ్లాక్ తెలుగుగంగ ఉప ప్రధాన కాల్వకు 10మీటర్ల మేర గండి పడింది. టీజీపీ అధికారులు తూతూ మంత్రంగా ఐదు మట్టి సంచులు అడ్డుగా వేసి చేతులు దులుపుకున్నారు. ఆ మట్టి సంచులు కరిగిపోయి తిరిగి గండి ఏర్పడింది. దీంతో నీరంతా వరి పొలాలను ముంచెత్తింది. పంట కాలం పూర్తి అయినా కోతలు కోయించుకోలేక 60 ఎకరాల్లో వరిని అలాగే రైతులు వదిలేశారు. విత్తనం వేయాల్సిన పొలాలు అన్నీ జలమయం కావడంతో సేద్యాలు చేసుకోలేక అలాగే బీళ్లుగా వదిలేశారు.
రైతులకు కడ‘గండ్లు’


