విద్యతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

Dec 26 2025 8:13 AM | Updated on Dec 26 2025 8:13 AM

విద్య

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

కోర్టులో పోలీసుల తీరు సరికాదు

జిల్లా జడ్జికి ఫిర్యాదు చేస్తాం నేడు విధులను బహిష్కరిస్తాం

పత్తికొండ న్యాయవాదులు

పత్తికొండ: కోర్టు హాల్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని బార్‌ అసోసియేషన్‌ ఆధ్యక్షుడు మధుబాబు, సీనియర్‌ న్యాయవాదులు మైరాముడు, అమరావతి సత్యనారాయణ, నరసింహ ఆచారి అన్నారు. పత్తికొండ పట్టణంలోని బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో గురువారం న్యాయవాదులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. గంజాయి కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్‌ చేయడం కోసం కోర్టు హాల్‌లోకి పోలీసులు రావడం న్యాయస్థానాన్ని అవమానపరచడమేనన్నారు. పత్తికొండ, చిప్పగిరి ఎస్‌ఐలతో పాటు పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కర్నూలు జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లో విధులను శుక్రవారం న్యాయవాదులు బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జికి పత్తికొండ న్యాయవాదులు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌శాఖ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేంద్రకుమార్‌, మల్లికార్జున, కృష్ణయ్య, జఠంగిరాజు, నెట్టేకల్‌, లక్ష్మణస్వామినాయుడు, నాగలక్ష్మయ్య, వాసుదేవనాయుడు, శ్రీనువాసరెడ్డి, రజాక్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు న్యాయవాదులు విధులకు దూరం

కర్నూలు: కోర్టులోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించి ఓ నిందితుడిని బలవంతంగా ఎత్తుకెళ్తూ న్యాయ వాదిని అవమాన పరిచిన ఘటనకు నిరసనగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ వాదుల సంఘం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. చిప్పగిరి, పత్తికొండ ఎస్‌ఐలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్‌ చౌదరి, వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

మెంటార్లుగా జిల్లా, మండల స్థాయి అధికారులు

కర్నూలు సిటీ: పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉన్నత పాఠశాలలకు మెంటార్లుగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించారు. జిల్లాలోని 361 ఉన్నత పాఠశాలలకు నియమించిన మెంటార్లతో నేటి(శుక్రవారం) ఉదయం 9.30 గంటలకు సునయన ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌.సుధాకర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పది పరీక్షల ఫలితాల పెంపునకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెంటార్లకు కేటాయించిన పాఠశాలల్లో పునరావృత బోధన, పునశ్చరణ, సాధన పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారన్నారు. అదేవిధంగా పిల్లలను ప్రోత్సహించడం, క్రమ శిక్షణ పెంపొందించడం, పరీక్షలకు సన్నద్ధం చేస్తారన్నారు.

కుక్కను తప్పించబోయి..

గోనెగండ్ల: అయ్యకొండ గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లకు చెందిన గుల్ల మొరుసు నాగేష్‌(35), ప్రభుతో పాటు మరో ఇద్దరు దేవనకొండ మండలంలోని లక్కందిన్నె గ్రామంలో పెయింట్‌ పనులు చేసేందుకు బుధవారం ఉదయం బైకులపై వెళ్లారు. పనులు ముగించుకొని రాత్రి గోనెగండ్లకు బయలు దేరారు. నాగేష్‌, ప్రభు ఒక బైకుపై వస్తుండగా మార్గమధ్యలో గోనెగండ్ల మండలం అయ్యకొండ గ్రామ సమీపంలో రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడ్డారు. దీంతో నాగేష్‌ తలకు తీవ్ర గాయమైంది. ప్రభు ఎడమ కాలు విరిగింది. అటుగా వెళ్తున్న వాహనదారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని గోనెగండ్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నాగేష్‌ను కర్నూలు ఆస్పత్రికి, ప్రభును ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. నాగేష్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రభు ఎమ్మిగనూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు నాగేష్‌కు భార్య సుశీల, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిరంజీవి తెలిపారు. ఇంటి పెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరును చూసిన కాలనీ వాసులు కంటతడి పెట్టుకున్నారు.

పట్టుబడిన మద్యం ధ్వంసం

డోన్‌ టౌన్‌: రూరల్‌ పోలీ సు స్టేషన్‌ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యా న్ని పోలీసులు ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారులతో కలిసి గురువారం పట్టణ సమీపంలో ధ్వంసం చేసినట్లు రూరల్‌ పోలీసు స్టేషన్‌ సీఐ సీఎం రాకేష్‌ తెలిపారు. ఇందులో 30 కేసులకు సంబంధించిన వాటిలో 90 ఎంఎల్‌ టెట్రా ప్యాకెట్లు 7,732, 526 క్వాటర్‌ బాటిళ్లు, 40 పుల్‌ బాటిళ్లతో పాటు 295 లీటర్ల నాటుసారా మొత్తం కలిపి దాదాపు 820.56 లీటర్ల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు.

అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌

బత్తలపల్లి: రద్దీగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగలను అరెస్ట్‌ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌ తెలిపారు. బత్తలపల్లి పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. బత్తలపల్లి మండలం కాటమకుంట గ్రామానికి చెందిన దొడ్డావుల ఆదిలక్ష్మి ఈ నెల 23న బత్తలపల్లిలో ధర్మవరం వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగులో నుంచి నాలుగు తులాల బంగారం గొలుసును దుండగులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ ప్రభాకర్‌ నేతృత్వంలో బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్‌, తాడిమర్రి ఎస్‌ఐ కృష్ణవేణి ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో కర్నూలు జిల్లా ఆదోని పట్టణ బైపాస్‌ రోడ్డులో ఉన్న భరత్‌నగర్‌లో నివాసముంట్ను కోటయ్య (డ్రైవర్‌), పిలీషా (క్లిప్పులు, హెయిర్‌ బ్యాండ్‌లు అమ్మకం), శాంతి (హోటల్‌లో కూలి)తో పాటు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించారు. వీరి నుంచి 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాలలను జువైనల్‌ హోంకు అప్పగించి, నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

కర్నూలు(అర్బన్‌): విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కురువ సంఘం నేతలు అన్నారు. గురువారం నగర శివారుల్లోని శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఇటీవల పోలీస్‌, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురువ సామాజిక వర్గానికి చెందిన వారి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోనే 2026 నూతన సంవత్సర కేలండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి, జిల్లా గొర్రెల మేకల సహకార సంఘం చైర్మన్‌ కేఏ శ్రీనివాసులు, కల్లూరు సింగిల్‌ విండో చైర్మన్‌ పర్ల శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువలు తమ పిల్లల విద్యపై అధిక దృష్టిని సారించాలన్నారు. అలాగే రాజకీయంగా కూడా కురువలు రాణించాలన్నారు. రానున్న స్థానిక సంస్ఘల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో కురువలు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా కురువలు ఐకమత్యంగా ఉండాలని, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. భీర లింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని అన్ని హంగులతో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు కే కిష్టన్న, దిశా కమిటీ సభ్యులు దేవశంకర్‌, కురువ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కే రామకృష్ణ, నాయకులు కేసీ నాగన్న, బీ రామకృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగాలు పొందిన వారికి భక్త కనకదాసు జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యం1
1/5

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

విద్యతోనే అభివృద్ధి సాధ్యం2
2/5

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

విద్యతోనే అభివృద్ధి సాధ్యం3
3/5

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

విద్యతోనే అభివృద్ధి సాధ్యం4
4/5

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

విద్యతోనే అభివృద్ధి సాధ్యం5
5/5

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement