అటవీ భూముల్లో మట్టి మాఫియా!
● వందలాది టిప్పర్లతో మట్టి రవాణా
● పట్టించుకోని అధికారులు
బండిఆత్మకూరు: టీడీపీ నాయకులు మట్టి సైతం వదలడం లేదు. అక్రమార్జనకు అటవీ భూముల్లో సైతం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు, కడమలకాలువ గ్రామ శివార్లలోని తెలుగుగంగ ప్రధాన కాలువ వెంట ఉన్న అటవీ, సొసైటీ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఇటుక తయారీకి సరిపడే ఎరమ్రట్టి ఉంది. ఈ మట్టిని కొల్లాగొట్టాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఇటీవలే దందా మొదలు పెట్టారు. ఆయా గ్రామాల్లో ఉండే దళారులతో పేదలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించారు. పేదలకు మాయమాటలు చెప్పి అక్రమ తవ్వకాలు జరపుతున్నారు. వందలాది ట్రిప్పుర్లతో రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారం అటవీ భూముల్లోనే కాకుండా తెలుగు గంగ ప్రధాన కాలువ వెంట కూడా సాగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి తెలుగుగంగ ప్రధాన కాలువపై ప్రొక్లెయిన్‌ను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


