చిత్తశుద్ధి ఉంటే అహోబిలంలో ప్రమాణం చేయాలి
● ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే
గంగుల బిజేంద్రారెడ్డి
చాగలమర్రి: అహోబిలంలో నవంబర్ 25న నిర్వహించిన తలనీలాల సేకరణ, టెంకాయల విక్రయాలకు సంబంధించి టెండరు దారులకు ఫారం ఇవ్వకుండా ఎవ్వ రి ఒత్తిడితో టెండరును రద్దు చేశారో విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నా రు. ఈ విషయంలో తమకు సంబంధం లేదని చెబుతున్న ఎమ్మెల్యే అఖిలప్రియకు చిత్తశుద్థి ఉంటే అహోబిలం వచ్చి శ్రీలక్ష్మీనరసింహ స్వామిపై ప్రమాణం చేయాలన్నారు. ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత 17 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి టెండరు దక్కించుకుంటున్నారని ఎమ్మెల్యే చెప్పటం హస్యాస్పదంగా ఉందన్నారు. టెండరు రద్దు చేయడానికి ఎవరి వద్ద నుంచి ఫోన్లు వస్తున్నాయో సీఈఓ బయటపెట్టాలన్నారు. కరెంటు, డీజల్, పెట్రోల్ ధరలు తగ్గించాల్సింది పోయి అక్రమార్జన కోసం టెండరు ధరలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. తక్కువకు కోడ్ చేసిన టెండర్లను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.


