గందరగోళంగా ఎన్‌సీడీ సర్వే!
కర్నూలు(హాస్పిటల్): జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు గణనీయంగా పెరుగుతున్నారు. ఇందులో ప్రధానంగా బీపీ, షుగర్, థైరాయిడ్, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి జబ్బు ముందుగా గుర్తించి బాధితులకు చికిత్స అందించడమే గాక జీవనశైలిలో మార్పులు తీసుకొస్తే అటు వారికి, ఇటు సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్‌సీడీ) సర్వేను ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా ఈ సర్వే పూర్తిగాకుండానే అటకెక్కుతూ మళ్లీ మొదటికి వస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న ఆదేశాలో లేక క్షేత్రస్థాయిలో సర్వే సరిగ్గా చేయడం లేదో అర్థం గాని పరిస్థితిల్లో తాజాగా ఎన్‌సీడీ 4.ఓ సర్వే కొనసాగుతోంది.
సమాజంలో అంటువ్యాధికాని వ్యాధులు (నాన్ కమ్యూనకబుల్ డిసీజ్) అయిన బీపీ, షుగర్, క్యాన్సర్, గుండెజబ్బులు, పక్షవాతం వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి వారికి సరైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీడీ 3.0 సర్వేను గత ఏడాది నవంబర్ 14న ప్రారంభించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 75 ఆరోగ్య కేంద్రాలు, 672 సచివాలయాల పరిధిలో 18 ఏళ్లు దాటిన వారు 19,43,321 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 13,49,503 మందికి (69.4శాతం) స్క్రీనింగ్ చేశారు. వ్యాధి లక్షణాల మేరకు పీహెచ్‌సీలకు అక్కడ నుంచి సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, అక్కడ నుంచి జీజీహెచ్ కర్నూలుకు రెఫర్ చేసి వైద్యం అందించేలా చేశారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు పరీక్షించి అనంతరం వ్యాధినిర్ధారణ కోసం కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు రెఫర్ చేస్తారు. వ్యాధినిర్ధారణ అయిన తర్వాత వారికి అవసరమైన వైద్యం అక్కడే అందిస్తారు.
అధికంగా బీపీ, షుగర్ బాధితులే...!
జిల్లాలో స్క్రీనింగ్ చేసిన 13,49,503 మందిలో 91,382 మందికి అధిక రక్తపోటు(బీపీ), 72,188 మందికి షుగర్(డయాబెటీస్), 4,231 మందికి నోటి క్యాన్సర్, 1,799 మందికి రొమ్ము క్యాన్సర్, 2,405 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించి మెడికల్ ఆఫీసర్ వద్దకు రెఫర్ చేశారు. వారిలో ఇప్పటి వరకు కొందరిని మాత్రమే పరీక్షించారు.
ఎన్‌సీడీ 3.ఓ ను పక్కన పడేసి!
నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్‌సీడీ) 3.ఓ 75శాతం పూర్తయ్యేలోగా దానిని ప్రభుత్వం పక్కన పడేసి ఎన్‌సీడీ 4.ఓను ప్రారంభించింది. ఇందులో అధికంగా వివిధ రకాల క్యాన్సర్ కేసులతో పాటు కొత్తగా బీపీ, షుగర్ రోగులను గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు. ఇలా ఒకే పనిని క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్‌ఎం లచే పదే పదే చేయిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. దీనివల్ల సర్వే నాణ్యత కూడా దెబ్బతింటోందని, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం నీరుగారిపోతోందని పలువురు వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదే పదే సర్వే పేరిట
ఏఎన్‌ఎంలకు తిప్పలు
ఒక్క సర్వే పూర్తిగా చేయనివ్వని వైనం
లెక్కతేలని బీపీ, షుగర్,
క్యాన్సర్ కేసుల వివరాలు


