అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి స్వీకరించే అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి, పారదర్శకతతో, అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలన్నారు. రీ–ఓపెన్ అయిన దరఖాస్తులు, బియాండ్ ఎస్‌ఎల్‌ఏలో ఉన్న అర్జీలు, వీఐపీ గ్రీవెన్స్‌లను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలన్నారు. కార్యక్రమానికి 276 మంది తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


