ఎమ్మెల్యే అఖిల వ్యాఖ్యలు హాస్యాస్పదం
● ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో
ప్రజలకు తెలుసు
● మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఆసుపత్రిని తానే నిర్మించానని, డిసెంబర్‌లో ప్రారంభిస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల స్థాయికి పెంచడానికి వీలుకాదని 2017లో టీడీపీ ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇచ్చారు కదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి 2023 డిసెంబర్‌లో తామే ప్రారంభించామని, ఇందుకు సాక్ష్యంగా శిలాఫలాకాలు అక్కడే ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో వార్డుల కోసం నిర్మాణం జరుగుతున్న గదులకు కూడా 2023లోనే భూమిపూజ చేశామన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసని, ఇప్పుడు అబద్ధాలు చెబితే ఎవరూ నమ్మబోరన్నారు. అబద్ధాల ప్రకటనలు మానుకుని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రైతుల కోసం మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకనట చేసి ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు.


