మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. వేకువ జాము నుంచే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పా హారం, బిస్కెట్స్ దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది.
నేరాలకు స్వస్తి పలకండి
● ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల: శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో ఎక్కడ రాజీ పడేది లేదని, నేరాలకు స్వస్తి పలకకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. ఆదివారం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు ఎస్పీ సూచనల మేరకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు చట్టాన్ని గౌరవించి సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. కుటుంబాల భవిష్యత్తు, సమాజంలో మంచిపేరు తెచ్చుకొని మార్పు చెందాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 24న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్‌సైట్‌లో, టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
ఆర్టీసీలో విజిలెన్స్ అధికారుల దాడులు
నంద్యాల(వ్యవసాయం): నంద్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఆదివారం విజయవాడ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు అకౌంట్స్ సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించారు. వివరాల మేరకు అకౌంట్స్ సెక్షన్‌లో పని చేసే సిబ్బంది ఆర్టీసీ ఆదాయాన్ని తన అకౌంట్‌లోకి మార్చుకొని తిరిగి పది రోజుల్లో అకౌంట్‌లో జమ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ నివేదికను విజిలెన్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆదేశాల మేరకు సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
కర్నూలు(అర్బన్): శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం విషయంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు తీర్మానం గిరిజనులను విడదీసిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్‌నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డు తీర్మానం చెంచులకు న్యాయం చేస్తూనే, గిరిజన లంబాడీలకు తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. ఆది వారం స్థానిక ఎల్‌హెచ్‌పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు నెలలో ఒక సారి శివ లింగాన్ని స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. అయితే కేవలం చెంచులకు మాత్రమే స్పర్శ దర్శనాన్ని కల్పిస్తూ లంబాడీలను విస్మరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బోర్డు కమిటీ సభ్యులు మరో సారి సమావేశం నిర్వహించి నెలలో ఒక సారి గిరిజన లంబాడీలు కూడా స్పర్శ దర్శనం చేసుకునే విధంగా తీర్మాణం చేయాలని కోరారు.


