సత్యసాయి బాబా సేవలు ప్రపంచానికి స్ఫూర్తి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవలు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఆదివారం స్థానిక సంజీవనగర్‌లోని సత్యసాయి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డీఆర్‌ఓ రాము నాయక్, జిల్లా అధికారులు హాజరై భగవాన్ సత్యసాయికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. బాబా బోధనలు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలకు చేరాయంటే, ఆయన ఆధ్యాత్మిక ప్రభావం ఎంత విస్తరించిందో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్య, వైద్యం రంగాల్లో సేవలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సత్యసాయి సీపీడబ్ల్యూ పథకాలు అమలు చేయడం ద్వారా బాబా సేవలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. సేవా తత్పరత ప్రజలందరిలో పెరిగి సమాజం పట్ల బాధ్యతతో సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం సత్యసాయి శత జయంతి సందర్భంగా ముగ్గురు మహిళలకు కుట్టు మిషన్లు, ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు.


