ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
పాణ్యం: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకున్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. తుపాన్‌తో పంటలకు నష్టం వాటిల్లినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆరోపించారు. పాణ్యంలో ఆదివారం విలేకరులతో కాటసాని మాట్లాడారు. తుపాన్ కారణంగా లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగితే తప్పుడు లెక్కలు చూపారని విమర్శించారు. ఖరీఫ్‌లో పండించిన వరికి గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. బస్తా ధర రూ.1400 మాత్రమే ఉందని, రైతులకు ప్రభుత్వం అండగా ఉండటం లేదన్నారు. అరటి గెలలను రోడ్డున పడేస్తున్న దుస్థితి చూస్తున్నామన్నారు. యురియా మొదలుకొని ఇప్పటి వరకు అన్నదాతలకు పెట్టిన కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో త్వరలో తెలిసివస్తుందన్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, వడ్డుగండ్ల రాముడు, బొజ్జన్న, జిల్లా వైఎస్సార్‌సీపీ ట్రేడ్ అధ్యక్షుడు చాంద్‌బాషా, బాబి, రైతులు పాల్గొన్నారు.


