‘వరి’ంచని ధర..
జిల్లాలో వరి సాగు 1,00,819 హెక్టార్లు. హెక్టారుకు 3 టన్నుల చొప్పున 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. రైతుల సొంత, స్థానిక అవసరాలు పోను 89,374 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని అంచనా. ఇందుకు తగ్గట్టు జిల్లాలో మద్దతు ధరకు వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కనీసం 20 నుంచి 25 కొనుగోలు కేంద్రాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు దళారుల ఉచ్చులో పడి తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రం ఇటీవల ధాన్యానికి ఏ – గ్రేడు క్వింటా రూ. 2,389, సాధారణ రకం రూ.2,369గా మద్దతు ధర ప్రకటించింది. ఈ లెక్కన ఏ గ్రేడు రకం బస్తా (77 కిలోలు) రూ.1,840 ఉంది. జిల్లాలో దాదాపు అందరూ ఏ – గ్రేడు రకమే రకమే సాగు చేశారు. మద్దతు ధర రూ.1,840 ఉన్నప్పటికీ దళారులు ప్రస్తుతం బస్తా (77 కేజీలు) రైతుల అవసరాన్ని, అవకాశాన్ని బట్టి బస్తా రూ. 1,200 నుంచి రూ.1,400కు మించి కొనుగోలు చేయడం లేదు. రైతులు, రైతు సంఘాలు ధాన్యం ధర పెంచాలని, మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని గగ్గోలు పెడుతున్నా పాలకులు, అధికార యంత్రాంగం కనీసం స్పందించడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో కోతలు వచ్చేసరికి ధర మరింత దిగజారుస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరి ధాన్యాన్ని లారీలోకి లోడ్ చేస్తున్న దృశ్యం


