విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల: పట్టణంలోని కేశవరెడ్డి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి శనివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ముల్లాన్‌పేటకు చెందిన దినేష్, ప్రవళ్లికల కుమారుడు ప్రజ్వల్(15) శుక్రవారం రాత్రి ఇంట్లో దిమ్మెకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడం, చదువులో రాణించకపోవడం, త్వరలోనే పదవ తరగతి పరీక్షలు వస్తుండటంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గుండె పోటుతో ఉపాధ్యాయుడి మృతి
పాణ్యం/కొలిమిగుండ్ల: ఎంతో కష్టపడి ఆశల ఉద్యోగం సాధించి విధుల్లో చేరిన నెల రోజుల్లోనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండె పోటుతో మృతి చెందారు. అవుకు పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ (37) ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ అనంతరం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాణ్యం మండలం నెరవాడ సమీపంలోని గిరిజన బాలుర పాఠశాలకు నియమితులయ్యారు. సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా అక్టోబర్ 13న విధుల్లో చేరాడు. అంతకు ముందు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుండేవారు. ఎట్టకేలకు డీఎస్సీలో ప్రతిభ చాటుకొని కొలువు సాధించడంతో జీవితంలో స్థిరపడేందుకు మార్గం సుగమమైంది. ఈలోగా విధి వక్రీకరించడంతో అర్ధాంతంగా మృతి చెందారు. శుక్రవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాదకర సంఘటనతో కుటుంబ సభ్యులు రోదనలు స్థానికులను కంట తడిపెట్టించాయి. ఎంఈఓ శ్రీధర్‌రావుతో పాటు నెరవాడ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణానాయక్, సిబ్బంది అవుకు చేరుకొని విజయ్‌కుమార్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


