బ్యాంక్ సిబ్బంది రక్తదానం
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో 60 మంది బ్యాంక్ సిబ్బంది శనివారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహించామన్నారు. రాష్ట్రంలో అత్యధిక వడ్డీని గ్రామీణ బ్యాంక్ ఇస్తోందన్నారు. అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, విజిలెన్స్ ఆఫీసర్ సలీం, మేనేజర్ రవీంద్ర, సీనియర్ మేనేజర్లు అమీత్‌కుమార్, స్ఫూర్తి, కిరణ్, సృజన్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకర జీవనానికి, సమాజ అభ్యున్నతికి, అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందన్నారు. డీఆర్‌ఓ రాము నాయక్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బంది కార్యాలయ ప్రాంగణంలో చెత్త తొలగింపు, మొక్కల సంరక్షణ, పరిసర పరిశుభ్రత వంటి శుభ్రత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌తో పాటు జేసీ, అధికారులు, సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రైవేట్ బస్సులో 15 కేజీల వెండి చోరీ
డోన్ టౌన్: జాతీయ రహదారి పక్కన ఒక హోటల్ సమీపంలో ఆగి ఉన్న ఒక ప్రైవేట్ బస్సులో నుంచి 15 కేజీల వెండిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ నుంచి ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్‌కు వెళ్తోంది. అందులో హైదరాబాద్‌కు చెందిన సంగ్రం అనే వ్యక్తి 15కిలోల వెండి తీసుకుని వెళ్తున్నాడు. శనివారం ఉదయం అల్పాహారం కోసం డోన్ సమీపంలో బస్సును ఆపగా బ్యాగును తీసుకోకుండా దిగాడు. ఈ సమయంలో ఒక కారు వచ్చి ఆక్కడ ఆగి ఇద్దరు వ్యక్తులు బస్సులోకి ఎక్కి వెండి ఉన్న బ్యాగును తీసుకొని పరారయ్యారు. ఈ మేరకు బాధితుడు డోన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లు
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, పాస్ సర్టిఫికెట్, టీసీ, రెసిడెన్సీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం, ఆధార్ ఐడీ తీసుకొని కళాశాలకు నేరుగా రావాలని తెలిపారు.
సివిల్స్‌కు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన వారై ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు రెండు ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్ కార్డు తదితర జిరాక్స్ కాపీలను జతపరిచి ఏపీ బీసీ స్టడీ సర్కిల్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా, కల్లూరు చిరునామాలో స్వయంగా వచ్చి దరఖాస్తులను ఈ నెల 25లోగా అందించాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు బీసీ భవన్, గొల్లపూడి, విజయవాడలో ఉచిత శిక్షణను అందించేందుకు ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటైందన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. వివరాలకు 08518– 236076 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
బ్యాంక్ సిబ్బంది రక్తదానం


