కుందూ పాత వంతెన పునరుద్ధరణ వేగవంతం
నంద్యాల: శిథిలావస్థకు చేరుకున్న కుందూ నది పాత వంతెన పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణ శివారులోని కుందూ నదిపై ఉన్న పాత వంతెననను జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆర్‌డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్నతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుందూ నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం ఇప్పటికే నూతన వంతెన నిర్మాణానికి భూసేకరణ నిధులు విడుదల చేసిందన్నారు. అయితే కొత్త వంతెన పూర్తవడానికి సమయం పట్టే అవకాశం ఉందన్నారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాత వంతెనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం వంతెన సామర్థ్యాని పెంచేందుకు లేయర్ వేసి, వంతెనకు ఇరువైపులా ఇనుప రైలింగులు ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కొత్త వంతెన పనులు పూర్తి అయ్యేంత వరకు పాత వంతెన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించి ప్రభుత్వ కొత్త కార్యాలయ భవనాల నిర్మాణానికి అవకాశాలపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.


